- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల కోసమే మోటార్లు ఆన్ చేయడం లేదు: కేటీఆర్ ఆరోపణ
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం కన్నెపల్లికి చేరుకోవడానికి నాలుగు గంటలు పడుతుందని, పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్ ప్రాంతాల్లో అడుగడుగునా తమను అడ్డుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, వరంగల్ బ్యూరో/మహదేవ్‌పూర్ : హైదరాబాద్ నుంచి కాళేశ్వరం కన్నెపల్లికి చేరుకోవడానికి నాలుగు గంటలు పడుతుందని, పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్ ప్రాంతాల్లో అడుగడుగునా తమను అడ్డుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం మండలం కన్నెపల్లి వద్ద ఆదివారం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. తాను పోలీసులను ప్రశ్నించగా, పై నుంచి ఆదేశాలు ఉన్నాయని, ముందుకు వెళ్లనివ్వొద్దని చెప్పారని వారు సమాధానం ఇచ్చారని తెలిపారు. ఎల్‌నినో, వర్షాభావంతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది పడిన గడ్డపై కూర్చున్నామని, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాటాలు సాగాయని, ప్రతి ఏడాది గోదావరి నుంచి వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తూనే ఉందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం జరిగిందన్నారు.
తెలంగాణ భౌగోళిక పరిస్థితుల్లో గోదావరి, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా, నీళ్లు కింద ఉండగా భూములు ఎత్తులో ఉన్నాయని, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే నీటిని తరలించాల్సిన పరిస్థితి ఉందన్నారు. పల్లపు ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. గోదావరి జలాలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేసి బృహత్తర ప్రణాళిక రూపొందించిందన్నారు. తుమ్మిడిహెట్టి డ్యాం ఎత్తు పెంపుపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సంప్రదించామని, 150 మీటర్ల ఎత్తు పెంచితే మహారాష్ట్ర ప్రాంతం మునిగిపోతుందని వారు తెలిపారని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద డ్యాం ఎత్తు పెంచవద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మహారాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు.
మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. ఎంతటి కరువులోనైనా నీటి లభ్యత ఉండే ప్రాంతంగా కాళేశ్వరాన్ని గుర్తించి ప్రాజెక్టు నిర్మించాలని అధికారులు సూచించారని తెలిపారు. అందుకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గురించి తాను పుట్టినప్పటి నుంచి వింటున్నానని, ఇప్పటికీ పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు. మండుటెండల్లోనూ, కరువు పరిస్థితుల్లోనూ నీటి లభ్యత ఉండే ప్రాంతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, సబ్‌స్టేషన్లు, 1,531 కిలోమీటర్ల కాల్వల సమాహారమని వివరించారు.
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోయినా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని విమర్శించారు. ఆ బ్లాక్‌ను పునర్నిర్మించడానికి రూ.400 కోట్లు సరిపోతాయని, ఎల్ అండ్ టీ ముందుకు వచ్చినా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టలేదన్నారు. "కాళేశ్వరం కూలేశ్వరం అయింది" అంటూ చేస్తున్న విమర్శలు అవాస్తవమని అన్నారు. కాళేశ్వరం ద్వారా కొత్తగా 40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. మూడు కాలాలపాటు నిలబడేలా ప్రాజెక్టును నిర్మించామని తెలిపారు. మిడ్ మానేరు నుంచి ఎక్కడికైనా నీటిని తరలించవచ్చని, ఫ్లడ్ ఫ్లో ద్వారా పంపులు ఆన్ చేయకుండానే నీటిని తరలించే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లి నుంచి కూడా నీటిని తీసుకురావచ్చని చెప్పారు.
కరువు పరిస్థితుల్లోనూ నీటి నిల్వ ఉండే ప్రాంతం కన్నెపల్లి అని పేర్కొన్నారు. ప్రస్తుతం 98 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. మేడిగడ్డ అవసరం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని తరలించవచ్చని చెప్పారు. కన్నెపల్లి వద్ద నీళ్లు ఉన్నప్పటికీ పంపులను ఆన్ చేయాలని రైతులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. మిడ్ మానేరు నింపాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి గంగుల కమలాకర్ కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఎక్కడా నీటి లభ్యత లేకపోయినా కన్నెపల్లి నుంచే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీలోనూ నీరు లేకుంటే రివర్స్ పంపింగ్ ద్వారా నిల్వ చేసుకోవచ్చన్నారు.
ఏడు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. కాకతీయ కాల్వల్లో నీళ్లు లేని సమయంలో నీటిని అందించింది కాళేశ్వరం ప్రాజెక్టేనని, అప్పర్ మానేరు అలుగు పొంగిందంటే దానికి కారణం కూడా కాళేశ్వరమేనని అన్నారు. హైదరాబాద్‌లో తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం రోజుకు 15 వేల వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణానికి రూ.94 వేల కోట్లు ఖర్చయితే, రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోయి లేదా? మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్పృహ లేదా? అని ప్రశ్నించారు. 2014కు ముందు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదని నిలదీశారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం వచ్చిన తర్వాతే సాగునీరు అందిందన్నారు. కాళేశ్వరం వల్ల రైతుల జీవితం మెరుగుపడిందని, రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించి వరి ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరిందన్నారు. రైతుల ఆత్మహత్యలు కూడా గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థత వల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది మృతి చెందారని, ఇప్పటికీ వారి మృతదేహాలను వెలికితీయలేని పరిస్థితి ఉందన్నారు. మీ హయాంలో సుంకిశాల గోడ కూలలేదా? వట్టెం పంప్‌హౌస్ కొట్టుకుపోలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పై రాజకీయ కక్షతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి గేట్లు ఎత్తితే నీరు వస్తుందని కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసన్నారు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి, పంట పండితే మద్దతు ధర ఇవ్వాలి, విద్యుత్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ, ఎన్డీఏలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పట్టిన శనేశ్వరంలా మారారని విమర్శించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజుల పాటు అప్పగిస్తే తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపిస్తామని సవాల్ విసిరారు.
మూడు నెలల క్రితమే ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని చెప్పామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ తాగునీటితో పాటు ఉమ్మడి ఏడు జిల్లాలకు నీరు అందించే సామర్థ్యం ఉందన్నారు. హుస్సేన్‌సాగర్ సామర్థ్యం ఒక టీఎంసీ మాత్రమేనని, ఈ పంపుల సామర్థ్యం రెండు టీఎంసీల వరకు ఉందన్నారు. సాగునీటికే కాకుండా హైదరాబాద్ తాగునీటికీ సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 50 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంపులను ముట్టడించి ఆన్ చేయిస్తామని హెచ్చరించారు. రైతుల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.లక్ష కోట్లు, 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కాళేశ్వరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులపై మొత్తం రూ.1.80 లక్షల కోట్లు వ్యయం చేశామని పేర్కొన్నారు. రైతుబంధు కోసం రూ.72 వేల కోట్లు, రైతుబీమా కోసం రూ.30 వేల కోట్లు అందించామని తెలిపారు. ఏ విధమైన సమగ్ర పరిశీలన చేయకుండానే 48 గంటల్లో ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. మేడిగడ్డ మరమ్మతులకు ఎల్ అండ్ టీ ముందుకు వచ్చినా ప్రభుత్వం వాటిని చేపట్టలేదని కేటీఆర్ విమర్శించారు.






