‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి

by Ratna Kumari |

ఇల్లు, ఇంటి స్థలాల కోసం నిరుపేదలంతా ఏకమై పోరాడాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు.

‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి
X

దిశ, కొత్తగూడెం : ఇల్లు, ఇంటి స్థలాల కోసం నిరుపేదలంతా ఏకమై పోరాడాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. చుంచుపల్లి మండలం ప్రశాంత్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఇల్లు, ఇంటి స్థలాల సాధన కోసం, పేదల ఇళ్ల కూల్చివేతలకు నిరసనగా, అలాగే పేదలు నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ సౌకర్యం, ఇంటి నంబర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే **‘చలో హైదరాబాద్’** ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న నిరుపేదల గుడిసెలను కూల్చివేసే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు విద్యుత్, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ప్రజావ్యతిరేక విధానాలతో పేదల ఇళ్లను కూల్చివేస్తే సహించబోమని హెచ్చరించిన ఆయన.. ప్రతి గుడిసెకు పట్టా ఇచ్చే వరకు, నిరుపేదల సొంతింటి కల నెరవేరే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ టౌన్ కార్యదర్శి కంచర్ల జమలయ్య, రామవరం ఏరియా కార్యదర్శి గోపికృష్ణ, సర్పంచ్ వాడె రాములు, కార్పొరేటర్ కూరపాటి సుధాకర్, నాయకులు భూక్యా శ్రీనివాస్, తూముల శ్రీనివాస్, రాజు, దార లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story