- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులకు పింఛన్, ఇళ్లు ఎంతో అవసరం: హర్యానా మాజీ గవర్నర్
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు, పాత్రికేయ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

దిశ, హిమాయత్ నగర్: జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు, పాత్రికేయ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో గల తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియంలో టీ.జే.ఏ రాష్ట్ర అధ్యక్షుడు కేవి రమణారావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర జర్నలిస్టుల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను ప్రజలకు అందించే పాత్రికేయుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా, గృహ వసతి, పెన్షన్, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు. జర్నలిస్టులకు గతంలో అమలులో ఉన్న రైల్వే ప్రయాణ రాయితీ పాసుల పునరుద్ధరణ అంశాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.
అక్రిడేషన్ కమిటీలలో స్థానం కల్పించడంపై హర్షం...
రాష్ట్ర జర్నలిస్టుల కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ అంశాన్ని గతంలోనూ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే పాసుల సౌకర్యాన్ని పునరుద్ధరించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి వృత్తిపరమైన సౌకర్యాల కోసం తనవంతు కృషి కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టు ప్రతినిధులు తమ సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంఘటితంగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీజెఏ అడ్వైజరీ కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్, టీ జే ఏ రాష్ట్ర అధ్యక్షుడు కే.వి. రమణారావు మాట్లాడుతూ, 12 సంవత్సరాల పోరాటం ఫలించి కాంగ్రెస్ ప్రభుత్వం టీ జేఏకు అక్రిడేషన్ కమిటీలలో స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్యూ జే (ఐ )కార్యవర్గ సభ్యుడు ధన్నారపు రాజలింగం, టిజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరీ, టి జేఏ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఖాసీం, కార్యదర్శి నాగస్వామి, కోశాధికారి ఖలీల్ అహ్మద్, టి జే ఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు చింతల నీలకంఠం, పలు జిల్లాల డిస్ట్రిక్ట్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు.






