- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం - అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యత
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లలలోనె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

దిశ, సత్తుపల్లి/కల్లూరు : ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లలలోనె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ముందుగా కల్లూరు మండలం చిన్నకోరుకొండ గ్రామంలో రూ.5. కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడుతున్న చిన్నకోరుకొండి - కిష్టారం వైరా - నెమలి రహదారులు మధ్య ఉన్న లింక్ రోడ్ కు, తర్వాత రూ. 6కోట్ల 30లక్షల వ్యయంతో లోకవరం పెనుబల్లి రహదారి పై హైలెవల్ బ్రిడ్జి పనులకు ఆనతరం నగరాభివృద్ధి లో భాగంగా కల్లూరు ప్రధాన రహదారి లో రూ.93 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు, అలాగే తిరువూరు ఎక్స్ రోడ్ కల్లూరు జంక్షన్ వద్ద రూ.8కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం నుండి అశ్వరావు పేట జాతీయ రహదారి జంక్షన్ అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళల సాధికారత, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తోందన్నారు. ప్రజలు అందించిన ఆశీస్సులు, దీవెనల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా, చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల ఇంటి ముంగిటకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా పాలన కొనసాగుతోందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి అర్హత కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, గతంలో పేదలకు అందని సన్న బియ్యాన్ని ఇప్పుడు రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితిని మార్చి అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు.
పేదల చిరకాల స్వప్నమైన సొంత ఇంటిని సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్లు, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేశామని, అనంతరం కూడా దశలవారీగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో తొలి విడతగా రూ.6 వేల చొప్పున టిగ్..టిగ్ అనె మెసేజ్ ద్వారా జమ అవుతున్నాయని, రెండు మూడు రోజుల్లో పూర్తిగా అందరికీ జమ అవుతాయని వెల్లడించారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
తాను కల్లూరు మండలంలో పుట్టి పెరిగిన వ్యక్తినని, పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సత్తుపల్లి నియోజకవర్గం కూడా తన సొంత ప్రాంతమేనని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని, ఇప్పటికే సుమారు రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ రూ.15 కోట్ల పనులతోనే అభివృద్ధి ఆగిపోదని, కొత్త మున్సిపాలిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.పేదల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






