Carlsberg IPO: ఐపీఓ బాటలో కార్ల్స్‌బర్గ్

by S Gopi |

ఈ విధానంలో కంపెనీలు తమ వ్యాపారానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయకుండా సెబీతో సమీక్ష ప్రక్రియను ప్రారంభించవచ్చు.

Carlsberg IPO: ఐపీఓ బాటలో కార్ల్స్‌బర్గ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: డానిష్ బీర్ దిగ్గజం కార్ల్స్‌బర్గ్ తన భారత వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసే దిశగా తొలి అడుగు వేసింది. దీనికోసం కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి రహస్య (కాన్ఫిడెన్షియల్) మార్గంలో డ్రాఫ్ట్ ఐపీఓ పత్రాలను సమర్పించినట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో కంపెనీలు తమ వ్యాపారానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయకుండా సెబీతో సమీక్ష ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఫిబ్రవరిలోనే కార్ల్స్‌బర్గ్ గ్రూప్ సీఈఓ జాకబ్ ఆరుప్-ఆండర్సన్, వాటాదారుల విలువను పెంచే వ్యూహంలో భాగంగా భారత వ్యాపారాన్ని లిస్ట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఐపీఓ పరిమాణం, విలువ, మార్కెట్లోకి వచ్చే సమయం వంటి అంశాలు సెబీ అనుమతులు, మార్కెట్ పరిస్థితులు, ఇతర నియంత్రణ అంశాలపై ఆధారపడి ఉంటాయని సమాచారం. భారత్‌లో టుబోర్గ్, కార్ల్స్‌బర్గ్ ఎలిఫెంట్, క్రోనెన్‌బర్గ్ 1664 బ్లాంక్ వంటి ప్రముఖ బీర్ బ్రాండ్‌లతో కార్ల్స్‌బర్గ్ బలమైన ఉనికిని కలిగి ఉంది. ప్రీమియం బీర్ విభాగంలో వాటాను పెంచుకోవడానికి గతేడాది క్రోనెన్‌బర్గ్ 1664 బ్లాంక్‌ను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే భారత ఐపీఓ మార్కెట్ మళ్లీ వేగం పుంజుకుంటోంది. జూన్‌లోనే ఆరు కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించగా, జియో ప్లాట్‌ఫామ్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కూడా సెబీకి డ్రాఫ్ట్ పత్రాలు సమర్పించాయి.

Next Story