- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: భారతీయుల ఇళ్లలో రూ. 415 లక్షల కోట్ల బంగారం
ప్రతి ఏడాది బిలియన్ల డాలర్లు వెచ్చించి బంగారం దిగుమతి చేసుకుంటున్నా, ఆ బంగారం ఎక్కువ భాగం ఇళ్లలో, లాకర్లలో, దేవాలయాల్లో నిరుపయోగంగా నిల్వగా ఉండిపోతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు. అది కుటుంబాల భద్రత, సంపద, సంప్రదాయం, తరతరాల వారసత్వానికి ప్రతీక. కానీ ఇదే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు మరో కోణంలో పెద్ద సవాలుగా మారుతోంది. భారతీయులు కొనుగోలు చేసే బంగారంలో దాదాపు మొత్తం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. ప్రతి ఏడాది బిలియన్ల డాలర్లు వెచ్చించి బంగారం దిగుమతి చేసుకుంటున్నా, ఆ బంగారం ఎక్కువ భాగం ఇళ్లలో, లాకర్లలో, దేవాలయాల్లో నిరుపయోగంగా నిల్వగా ఉండిపోతోంది. మళ్లీ వచ్చే ఏడాది కొత్త బంగారం కోసం మరిన్ని డాలర్లు బయటకు పోతుంటాయి. ఇలా కొండంత బంగారం దేశం లోపలే ఉన్నా, అది ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడకుండా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మిగిలిపోతుండటం పెద్ద క్లిష్టమైన పరిస్థితిగా మారింది.
జీడీపీని మించిన పసిడి కొండ
మనదేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద ఉన్న ప్రైవేట్ బంగారు నిల్వల పరిమాణం వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ (డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం, మన దేశంలో సుమారు 25,000 టన్నుల బంగారం లాకర్లలో మగ్గుతోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది 30,000 నుంచి 50,000 టన్నుల వరకు కూడా ఉండొచ్చు. గత రెండేళ్లుగా పసిడి ధరలు ఆకాశాన్నంటడంతో, 2026, జనవరి నాటికి ఈ నిల్వల విలువ ఏకంగా 5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 415 లక్షల కోట్లు) పైగా చేరింది. ఇది ప్రస్తుత దేశ మొత్తం జీడీపీలో 125 శాతానికి సమానం. ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం నిల్వలను కలిపినా, మన భారతీయ ఇళ్లల్లో ఉన్న బంగారమే ఎక్కువ కావడం విశేషం.
రూపాయిపై ఒత్తిడి
ఇంత భారీ సంపద దేశం లోపల ఉన్నప్పటికీ, ఇటీవల అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో బంగారం దిగుమతుల భారం దేశంపై తీవ్రంగా పడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి పరిమాణం 721 టన్నులకు తగ్గినప్పటికీ, ధరల పెరుగుదల వల్ల వాటి విలువ 24 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 71.9 బిలియన్ డాలర్ల(రూ. 6.84 లక్షల కోట్ల)కు చేరింది. దీనివల్ల మన దేశ వాణిజ్య లోటు పెరిగి, రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దేశంలో పెట్రోలియం తర్వాత అత్యధికంగా డాలర్లు ఖర్చవుతున్నది బంగారం కోసమేనని ఆర్‌బీఐ చెబుతోంది. అందుకే, దేశ సరిహద్దుల లోపలే ఉన్న పాత బంగారాన్ని మళ్లీ మార్కెట్లోకి తెచ్చి, కొత్త దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
సరికొత్తగా 'గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్'
నిజానికి, ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయించి, దానిపై వడ్డీ ఇచ్చేందుకు 2015లోనే ‘గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్’ (జీఎంఎస్) తెచ్చారు. కానీ, 2024, నవంబర్ నాటికి కేవలం 31 టన్నుల బంగారం మాత్రమే వసూలైంది. సెంటిమెంట్ వల్ల ఆభరణాలను కరిగించడానికి ప్రజలు ఇష్టపడకపోవడం, వడ్డీ తక్కువగా ఉండటం, బ్యాంకుల చుట్టూ తిరిగే ప్రాసెస్ కష్టంగా ఉండటంతో అది ఫెయిల్ అయింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం రూట్ మార్చింది. ప్రజలకు బాగా నమ్మకమైన స్థానిక నగల వ్యాపారులను ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలని చూస్తోంది. నగల వ్యాపారులే గోల్డ్ కలెక్షన్ సెంటర్లుగా మారి, బంగారాన్ని సేకరించి బ్యాంకులకు పంపుతారు. దీనివల్ల నగల వ్యాపారులకు తక్కువ రేటుకే ముడిసరుకు దొరుకుతుంది, ప్రభుత్వానికి దిగుమతుల భారం తగ్గుతుంది.
సెంటిమెంట్ వర్సెస్ బిజినెస్
ఇక్కడో ఆసక్తికరమైన సంగతేంటంటే.. భారతీయులు బంగారాన్ని డిపాజిట్ చేయడానికి వెనుకాడుతున్నారు కానీ, తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి మాత్రం ఎగబడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ముత్తూట్, మణప్పురం, ఐఐఎఫ్ఎల్ వంటి గోల్డ్ లోన్ కంపెనీల వద్దే ఏకంగా 334 టన్నుల బంగారం తాకట్టు రూపంలో ఉంది. అంటే, ప్రాసెస్ సులభంగా ఉండి, తమ యాజమాన్య హక్కులు తమకే ఉంటాయంటే కస్టమర్లు బంగారాన్ని బయటకు తీయడానికి రెడీగా ఉన్నారని ఇది నిరూపిస్తోంది. కాబట్టి, రాబోయే కొత్త స్కీమ్‌లో పన్ను మినహాయింపులు ఇస్తూ, ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తే నిద్రాణంగా ఉన్న బంగారం ఆర్థికవ్యవస్థలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు.
చిన్న మార్పు.. కొండంత లాభం
దేశంలోని ఇళ్లల్లో ఉన్న మొత్తం బంగారంలో ప్రతి ఏటా కేవలం 2 శాతం బంగారాన్ని మాత్రమే అధికారికంగా ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించగలిగితే, గుణకార ప్రభావం (మల్టిప్లయర్ ఎఫెక్ట్) ద్వారా 2047 నాటికి దేశ జీడీపీకి ఏకంగా 7.5 ట్రిలియన్ డాలర్ల అదనపు సంపద తోడవుతుందని ‘అసోచామ్’ అంచనా వేసింది. ప్రజలు బంగారం కొనడం ఆపేయాల్సిన అవసరం లేదు, కానీ ఇళ్లల్లో లాక్ అయిన పాత బంగారంలో కొంత భాగాన్ని వర్కింగ్ క్యాపిటల్‌గా మారిస్తే చాలు. ఇది దేశీయ రుణ లభ్యతను పెంచి, అంతర్జాతీయ ఒడిదుడుకుల నుంచి రూపాయిని రక్షించి, దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది.






