- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైల్లో గ్యాంగ్ వార్.. ఇద్దరు మృతి.. 34 మందికి తీవ్ర గాయాలు
శ్రీలంకలోని నెగోంబో (Negombo) పట్టణంలో ఉన్న కేంద్ర కారాగారం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా రణరంగంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంకలోని నెగోంబో (Negombo) పట్టణంలో ఉన్న కేంద్ర కారాగారం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా రణరంగంగా మారింది. జైలు లోపల ఉన్న ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులతో పాటు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), శ్రీలంక ఆర్మీ బలగాలు భారీగా జైలు ప్రాంగణానికి చేరుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రంగంలోకి దిగిన అదనపు రక్షణ బలగాలు లాఠీచార్జ్ చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం నెగోంబోలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో కొందరిని మెరుగైన వైద్యం కోసం కొలంబో నేషనల్ హాస్పిటల్‌కు తరలించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
డ్రగ్స్ వార్
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. జైలు లోపల చాలా కాలంగా డ్రగ్స్ వాడకం జరుగుతోందని, ఈ ఘటనకు ప్రధాన కారణం డ్రగ్సేనని తెలుస్తోంది. కారాగారం పరిధిలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడిపించే ఒక ముఠాకు, దానిని తీవ్రంగా వ్యతిరేకించే మరో గ్రూపునకు మధ్య పాత కక్షల నేపథ్యంలో ఈ గొడవ మొదలైంది. ఇదిలా ఉండగా, జైలులో పరిమితికి మించి విపరీతంగా ఖైదీలను ఉంచడం వల్ల కూడా వారి మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరిగి నేడు ఈ ఘోరానికి దారితీసిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గొడవలో కొంతమంది ఖైదీలు జైలు భవనంపైకి ఎక్కి నిరసన తెలపగా, ఆ బరువుకు భవనం పైకప్పు (Roof) కొంత భాగం కూలిపోవడంతో నలుగురు ఖైదీలు అదనంగా గాయపడినట్లు జైలు అధికారులు ధృవీకరించారు.
మహిళా ఖైదీల ఆందోళన
కారాగారంలోని మగవాళ్ల బ్యారక్‌లలో ఈ గ్యాంగ్ వార్ జరుగుతుండగానే, అదే జైలులోని మహిళా ఖైదీల విభాగంలో మరో తీవ్రమైన ఆందోళన మొదలైంది. జైలు పరిసర ప్రాంతాల్లో, బ్యారక్‌లలో పారిశుద్ధ్య లోపం కారణంగా డెంగీ జ్వరాలు (Dengue) విపరీతంగా వ్యాపిస్తున్నాయని మహిళా ఖైదీలు ఒక్కసారిగా నిరసనకు దిగారు. ఈ ఆందోళనను కూడా అధికారులు అదుపులోకి తెచ్చారని, ప్రస్తుతం జైలు లోపల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఖైదీల బంధువులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని చెబుతూ, ఈ మొత్తం ఉదంతంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కమిషనర్ జనరల్ పేర్కొన్నారు.






