- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2029లో జమిలి ఎలక్షన్స్?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్లు అధ్యయనం చేస్తున్న జేపీసీ చైర్మన్, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల మొదలవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్లు అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చైర్మన్, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు. ఈ సారికి బిల్లు ప్రవేశపెట్టకున్నా.. ఆ మాటకొస్తే 2028 జులైలోపు బిల్లు వచ్చినా సరే 2029 జనరల్ ఎన్నికలు జమిలిగా నిర్వహించడం సాధ్యమేనని వివరించారు. అయితే, కొన్ని రాష్ట్రాల గడువులు తగ్గించాల్సి రావొచ్చని, అలా చేసినా జమిలి ఎన్నికలు దేశానికి ప్రయోజనమే చేకూరుస్తుందన్నారు. ఆగమేఘాల మీద బిల్లుపై రిపోర్ట్ సమర్పించాల్సిన ఒత్తిడి తమపై లేదని, అన్నివర్గాల మద్దతు కూడగట్టి ఈ విషయంలో సమిష్టిగానే ముందడుగు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశాన్ని లేవనెత్తారు కాబట్టి వ్యతిరేకించడానికి బదులు దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలకు మినహా అంతటా ఈ ప్రతిపాదనలకు ఆమోదమే లభిస్తున్నదన్నారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాలు, యూటీల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని, లేదా నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడమే ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదన. ఈ ఎన్నికలు నిర్వహించిన 100 రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసి దేశంలో నిత్యం ఎన్నికల వాతావరణాన్ని తొలగించి అభివృద్ధిపై పాలనను కేంద్రీకరించే లక్ష్యంతో ఈ బిల్లును తెచ్చినట్టు చౌదరి వివరించారు.
మధ్యలోనే ప్రభుత్వం కూలిపోతే?
జమిలి ఎన్నికలపై జేపీసీ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నది. మాజీ సీజేల దగ్గర నుంచి న్యాయనిపుణుల వరకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కార్యదర్శులు సహా పలువురి అభిప్రాయాలు స్వీకరిస్తున్నది. దేశంలో జమిలిగానే ఎన్నికలు మొదలయ్యాయని, 1952 నుంచి 1967 వరకు లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేవని పీపీ చౌదరి గుర్తు చేశారు. 20 ఏళ్లపాటు జమిలిగా ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌లతో నిర్వహించారనీ వివరించారు. లోక్‌సభకు ఎవరిని పంపాలి? అసెంబ్లీకి ఎవరిని పంపాలనేది ఓటర్లకు తెలుసని, కాబట్టి, ప్రాంతీయ పార్టీలకు, రాష్ట్రస్థాయి రాజకీయాలకు జమిలి పెద్ద దెబ్బ అనే ఆరోపణలు అనవసరమైనవని అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలు కూలిపోవడంతో జమిలి చెదిరిపోయిందని, ఇకపైనా అలాగే అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రభుత్వం కూలిపోతే పరిస్థితి ఏమిటనే విషయంపై మేధోమథనం జరుగుతున్నది. ఒకవేళ అలా ప్రభుత్వం కూలినప్పుడు ఆ ఐదేళ్లలో మిగిలిన టర్మ్ కోసం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నామని మే నెలలో పీపీ చౌదరి వెల్లడించారు. 1993లో చేసిన రాజ్యాంగ సవరణ.. స్థానిక స్వయంపాలక సంస్థల్లో అవిశ్వాసం నెగ్గినప్పుడు మిగిలిన టర్మ్ బాధ్యతలను కొత్త చైర్మన్, కొత్త కమిటీ తీసుకునే అవకాశాన్ని తెచ్చిందని వివరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సూత్రాన్నే అసెంబ్లీ, పార్లమెంటుకు కూడా విస్తరించవచ్చునని తెలిపారు.
గతంలో అసెంబ్లీలను రద్దు చేసిన దాఖలాలు
జమిలి ఎన్నికల కోసం లోక్‌సభతోపాటు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను పొడిగించాల్సి ఉండగా, మరికొన్నింటిని ముందస్తుగానే రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది దేశవ్యాప్తంగా చాలా రకాల ఆందోళనలు, ఆరోపణలు రేపే చాన్స్ ఉన్నది. అందుకే పార్టీపై ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడకుండా జాగ్రత్తగా, మెజార్టీవర్గాల సమ్మతితో ముందుకుసాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, ఇలా అసెంబ్లీ గడువుల మార్పు తప్పదని జేపీసీ చైర్మన్ చౌదరి స్పష్టం చేశారు. 1967-68లోనూ లోక్‌సభతోపాటుగా ఎన్నికలు నిర్వహించడానికి 5-7 రాష్ట్రాల అసెంబ్లీలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా రద్దు చేసిందని వివరించారు. ఇలా రద్దు చేయడం తప్పేమీ కాదన్నారు.
మూడు విడతల్లో జమిలి అమలు?
2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే సంకేతాలను ఒకవైపు వస్తున్నా.. మరోవైపు ఇందుకోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా 2029 నుంచి 2034 వరకు విడతల వారీగా జమిలి ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలనే ఆలోచనలూ జేపీసీ వద్ద ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా మూడు విడతల్లో లోక్‌సభతో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను జోడించాలనే ప్రతిపాదనలున్నట్టు సమాచారం. దీని ప్రకారం, 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ గడువు మరో ఐదారు నెలలు పొడిగించాల్సి ఉంటుంది. అంటే, తెలంగాణ అసెంబ్లీని మరో ఐదారు నెలలు పొడిగిస్తే 2029 లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించవచ్చు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ము కశ్మీర్‌ల ఎన్నికలు 2029లో లోక్‌సభతోపాటే(చివరి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ గడువులను మూడు నెలలు తగ్గించాలి) జరుగుతాయి. ఇక మూడో విడతలో భాగంగా 2030, 2031లో జరిగే అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల అసెంబ్లీలను ఒకటి లేదా రెండేళ్లు తగ్గించి 2034 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించాలి. ఫలితంగా 2034 నుంచి జమిలి ఎన్నికలు సంపూర్ణంగా అమల్లోకి వస్తాయి.






