ITR 2026: పన్ను చెల్లింపుదారులు డబుల్ రిటర్న్స్ ఫైల్ చేయాలా?

by S Gopi |

ఒకే ఆదాయానికి రెండు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం అస్సలు లేదని స్పష్టం చేసింది.

ITR 2026: పన్ను చెల్లింపుదారులు డబుల్ రిటర్న్స్ ఫైల్ చేయాలా?
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను చట్టం, 2025 అమలులోకి రానుండటంతో పన్ను చెల్లింపుదారుల్లో ఒక సందేహం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2026 నుంచి పాత 'అసెస్‌మెంట్ ఇయర్' స్థానంలో కొత్తగా 'టాక్స్ ఇయర్' విధానం రావడంతో, ఒకే ఆర్థిక సంవత్సరానికి రెండు సార్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ గందరగోళానికి ఆదాయపు పన్ను శాఖ తెరదించింది. ఒకే ఆదాయానికి రెండు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం అస్సలు లేదని స్పష్టం చేసింది. చట్టం మారినా, పదాలు మారినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీరు సంపాదించిన ఆదాయానికి ఎప్పటిలాగే ఒకే ఒక్క రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుందని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది.

వచ్చే ఏడాదిలోనే మార్పులు

మనం ఈ ఏడాది (2025, 1 ఏప్రిల్ నుంచి 2026, 31 మార్చి మధ్య) సంపాదించిన ఆదాయాన్ని ఫైల్ చేయడానికి పాత పద్ధతినే అనుసరించాలి. సాధారణంగా మనం వాడే ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు ఉండే ఫారాలే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు కేవలం 'అసెస్‌మెంట్ ఇయర్ 2026-27'ని ఎంచుకుని, పాత 1961 చట్టం నిబంధనల ప్రకారమే తమ ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. ఆడిట్ అవసరం లేని సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఎప్పటిలాగే 2026, జూలై 31 గడువు తేదీగా ఉంటుంది. మరి కొత్త చట్టం ఎప్పటి నుండి వర్తిస్తుందంటే.. 2026, ఏప్రిల్ 1 నుండి మీరు సంపాదించే ఆదాయానికి 'టాక్స్ ఇయర్ 2026-27' కింద కొత్త చట్టం ప్రకారం 2027లో మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రెండు చట్టాల మధ్య మార్పు జరుగుతున్న కాలంలో (ట్రాన్సిషన్ పీరియడ్) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ-ఫైలింగ్ పోర్టల్ రెండు విధానాలకు సపోర్ట్ చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

లేట్ ఫీజుల లెక్కలివే.. క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ

ఒకవేళ గడువు తేదీ లోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే పడే 'ఆలస్యపు రుసుము' విషయంలోనూ ఐటీ శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుత ఫైలింగ్ సీజన్ (2026-27)కి సంబంధించి గడువు దాటితే పాత చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ నిబంధనలే వర్తిస్తాయి. అయితే, భవిష్యత్తులో కొత్త చట్టం (టాక్స్ ఇయర్ 2026-27, ఆ తర్వాత) కింద రిటర్న్స్ ఆలస్యమైతే సెక్షన్ 428 ప్రకారం జరిమానా విధిస్తారు. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే రూ. 1,000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ. 5,000 లేట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పన్ను చెల్లింపుదారులు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, పాత పద్ధతిలోనే 'అసెస్‌మెంట్ ఇయర్ 2026-27' కింద ఒకే ఒక రిటర్న్ ఫైల్ చేయడంపై దృష్టి పెడితే సరిపోతుంది.

Next Story