HDFC Bank: ఏఐ మోసాలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వార్

by S Gopi |

బ్యాంక్ తన అవసరాలకు అనుగుణంగా సొంత స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎస్ఎల్ఎం) కూడా అభివృద్ధి చేస్తోంది.

HDFC Bank: ఏఐ మోసాలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వార్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫిన్‌టెక్ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌లు, మోసాలను గుర్తించే వ్యవస్థలను అభివృద్ధి చేసింది. బ్యాంక్ రూపొందించిన 'నీవ్' అనే జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ రోజువారీ కార్యకలాపాలను ఆటోమేట్ చేయడంతో పాటు సేవలను మరింత వేగంగా అందించడంలో ఉపయోగపడుతోంది. గురుగ్రామ్‌లోని ఇంజినీరింగ్ సెంటర్‌లో 150–200 మంది ప్రత్యేక ఏఐ ప్రొఫెషనల్స్ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తుండగా, బ్యాంక్ తన అవసరాలకు అనుగుణంగా సొంత స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎస్ఎల్ఎం) కూడా అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో బ్యాంకులు టెక్నాలజీ కంపెనీలుగా మారతాయి. సొంత ఇంజినీరింగ్ సామర్థ్యం, సొంత ప్లాట్‌ఫామ్‌లు లేకపోతే పోటీ పడటం కష్టమేనని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రమేష్ లక్ష్మీనారాయణన్ తెలిపారు.

ఏఐతో పాటు, బ్యాంక్ రియల్ టైమ్‌లో లావాదేవీలను విశ్లేషించి మోసాలను వెంటనే గుర్తించే ఇన్-హౌస్ ఫ్రాడ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అభివృద్ధి చేసింది. లావాదేవీల్లో ఏదైనా అనుమానాస్పద మార్పు కనిపిస్తే, మైక్రో సెకన్లలోనే దాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే సామర్థ్యం దీనికి ఉందని బ్యాంక్ తెలిపింది. ఇదే సిస్టమ్‌ను యూపీఐ మోసాలను అరికట్టడానికి కూడా ఉపయోగిస్తోంది. మోసపూరిత ఖాతాలను నిరోధించేందుకు కేవైసీ నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో పాటు, ఆధార్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్, క్రెడిట్ బ్యూరో తనిఖీలు, అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) డేటాబేస్‌లతో అనుసంధానం చేసింది. బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో, సొంత టెక్నాలజీపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేస్తున్న ఈ పెట్టుబడులు భవిష్యత్ డిజిటల్ బ్యాంకింగ్ వ్యూహంలో కీలక అడుగుగా మారుతున్నాయి.

Next Story