Tech Hiring: 8 శాతం తగ్గిన టెక్ ఉద్యోగాల నియామకాలు

by S Gopi |

ఐటీ సేవల రంగంలో ఉద్యోగాల సంఖ్య నెలవారీగా 42 వేల వరకు పెరిగినా, వార్షికంగా 22 శాతం తగ్గడం ఆ రంగంలో కొనసాగుతున్న ఒత్తిడిని సూచిస్తోంది.

Tech Hiring: 8 శాతం తగ్గిన టెక్ ఉద్యోగాల నియామకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల మార్కెట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రత్యేక స్టాఫింగ్ కంపెనీ ఎక్స్‌ఫినో ప్రకారం, ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల యాక్టివ్ డిమాండ్ 1.06 లక్షలుగా నమోదైంది. ఇది జూన్‌తో పోలిస్తే 14 శాతం పెరిగినా, గతేడాది జూలైతో పోలిస్తే ఇంకా 8 శాతం తక్కువ. జూన్‌లో నమోదైన భారీ మందగమనం తర్వాత ఇది కొంత పుంజుకున్న సంకేతంగా కనిపిస్తున్నా, మార్చిలో నమోదైన గరిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుత డిమాండ్ ఇంకా 11 శాతం తక్కువగానే ఉంది. ఐటీ సేవల రంగంలో ఉద్యోగాల సంఖ్య నెలవారీగా 42 వేల వరకు పెరిగినా, వార్షికంగా 22 శాతం తగ్గడం ఆ రంగంలో కొనసాగుతున్న ఒత్తిడిని సూచిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగాల డిమాండ్‌లో టెక్ రంగం వాటా 49 శాతానికి చేరినా, వరుసగా నాలుగో నెల కూడా అది 50 శాతం దిగువనే ఉండటం గమనార్హం.

అయితే ఏఐ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) నియామకాలు మాత్రం టెక్ ఉద్యోగ మార్కెట్‌కు కొత్త ఊపు ఇస్తున్నాయి. ఫౌండ్ఇట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ ప్రకారం, 2026లో ప్రతి మూడు కొత్త జీసీసీ ఉద్యోగాల్లో దాదాపు రెండు (64 శాతం) ఉద్యోగాలకు ఏఐ, డేటా సైన్స్ లేదా ఇంటెలిజెంట్ ఆటోమేషన్ నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌వేర్, బీఎఫ్ఎస్ఐ రంగాలు కలిసి జీసీసీ నియామకాలలో 56 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జూన్ నాటికి దేశంలో జీసీసీల ద్వారా 2.28 లక్షల మందికి పైగా ఉద్యోగాలు లభించగా, ఇది గతేడాదితో పోలిస్తే 11 శాతం పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 2,120 జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది చివరికి మొత్తం జీసీసీ నియామకాలు 5.10 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా.

టైర్-2 నగరాల వైపు జీసీసీల దృష్టి

నియామకాల పరంగా బెంగళూరు మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. జూలైలో అక్కడ 24 వేల టెక్ ఉద్యోగాలు నమోదవగా, నెలవారీగా 20 శాతం పుంజుకున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఇది ఇంకా 43 శాతం తక్కువగా ఉంది. జీసీసీ నియామకాల్లో కూడా 30 శాతం వాటాతో బెంగళూరే ముందంజలో ఉండగా, హైదరాబాద్, పూణే, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక కంపెనీలు కేవలం తక్కువ ఖర్చుల కోసం కాకుండా, ఏఐ, ఇంజినీరింగ్, ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్‌లో జీసీసీలను విస్తరిస్తున్నాయని ఫౌండ్ఇట్ తెలిపింది. ముఖ్యంగా టైర్-2 నగరాలపై పెరుగుతున్న ఆసక్తి, భవిష్యత్ టెక్ ఉద్యోగాల వృద్ధి ఇక మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాదని సూచిస్తోంది.

Next Story