బైక్‌ పై నుంచి కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

by Batti.Sumithra |

బైక్‌పై వెళ్తూ రోడ్డు డివైడర్‌ను ఢీకొని కిందపడడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బైక్‌ పై నుంచి కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
X

దిశ, ఘట్‌కేసర్ : బైక్‌పై వెళ్తూ రోడ్డు డివైడర్‌ను ఢీకొని కిందపడడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, పుల్లూరు గ్రామానికి చెందిన నెల్లూరి సాయి వర్షిత్ (20) పోచారం ఇన్ఫోసిస్ కంపెనీ సమీపంలోని డాల్ఫిన్ హాస్టల్‌లో ఉంటూ, భువనగిరిలోని అరోరా కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇన్ఫోసిస్ కంపెనీ సమీపంలోని ఓ కిరాణా దుకాణం వద్ద క్యారమ్ బోర్డు ఆడుతున్న స్నేహితుల వద్ద నుంచి యమహా బైక్ తాళాలు తీసుకుని అన్నోజిగూడ వైపు వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా సింగపూర్ టౌన్‌షిప్ సమీపానికి రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో సాయి వర్షిత్ రోడ్డుపై పడిపోవడంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్నేహితులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయి వర్షిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోచారం ఐటీ కారిడార్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మృతుడి తల్లి నెల్లూరి కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Next Story