- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈవో విచారణ
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి (డీఐఈవో) కల్పన అంతర్గతంగా విచారణ నిర్వహించడం మండలవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

దిశ, కమాన్‌పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి (డీఐఈవో) కల్పన అంతర్గతంగా విచారణ నిర్వహించడం మండలవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 2వ తేదీన నిర్వహించిన ఈ విచారణకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల జిల్లా కలెక్టర్ శ్రీహర్షకు కొందరు ఫిర్యాదు చేశారు. కళాశాలకు సంబంధించిన పాత పుస్తకాలను బయట విక్రయించడంతో పాటు, విద్యార్థుల నుంచి పరీక్ష రుసుమును నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనితో పాటు, కొందరు అధ్యాపకులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణల పై తీవ్రంగా స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష.. కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని డీఐఈవో కల్పనను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 2వ తేదీన కళాశాలకు చేరుకున్న డీఐఈవో కల్పన.. విద్యార్థులు, అధ్యాపకులతో వేర్వేరుగా మాట్లాడి, అంతర్గతంగా సుదీర్ఘంగా విచారణ నిర్వహించినట్లు తెలిసింది. అనంతరం విచారణకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈ విషయం పై వివరణ కోసం డీఐఈవో కల్పనను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆమె అందుబాటులోకి రాలేదు.






