లో బడ్జెట్.. ఫుల్ కంఫర్ట్..! ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇండ్లపై జనం ఆసక్తి!

by Javid Pasha |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

లో బడ్జెట్.. ఫుల్ కంఫర్ట్..! ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇండ్లపై జనం ఆసక్తి!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : సమయం ఆదా , ఖర్చు తక్కువ అవుతుండడంతో ఇటీవల కాలంలో నగర ప్రజలు ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇండ్ల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని మోడ్యులర్ ఇండ్లు అని కూడా పిలుస్తారు. ఇటుకలు లేకుండా స్టీల్ కేవలం అల్యూమినియంతో నిర్మించడం వీటి ప్రత్యేకత. స్టీల్ సహాయంతో గోడలను, స్లాబ్‌ను ఒకేసారి కాంక్రీట్‌తో నిర్మిస్తారు. సిమెంట్ వాడకం కూడా చాలా వరకు తగ్గడంతో ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఇంటికి కావలసిన స్టీల్ పిల్లర్లు, అల్యూమినియం గోడలను ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు. వీటిని నిర్మాణ స్థలానికి చేర్చి అక్కడే నట్లు, బోల్టులతో ఒకదానికొటి బిగిస్తారు. ఇంతకీ ఈ ఇండ్ల నిర్మాణ ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

భూకంపాలను తట్టుకునే శక్తి..

సాధారణ ఇల్లు కట్టడానికి నెలలు, కొన్ని సందర్భాలలో సంవత్సరాలు పడుతుంది. కానీ.. ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇండ్ల నిర్మాణం రోజుల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఇక స్టీల్, అల్యూమినియం ఇండ్లను వారాల వ్యవధిలోనే పూర్తి చేయవచ్చు. సాధారణ పద్ధతిలో ఇల్లు కట్టడానికి 90 రోజులు పడితే ఈ టెక్నాలజీతో కేవలం 12 నుండి 15 రోజుల్లోనే పూర్తవుతుంది. పైగా ఇవి బలమైని, సురక్షితమైనవి, భూకంపాలకు సైతం తట్టుకునే శక్తి కలిగి కలిగినవి కావడంతో చాలామంది ఈ ఇండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. వీటికి చెదలు సైతం పట్టదు. అవసరమనుకుంటే ఇల్లును విడదీసి మరోచోటికి కూడా తరలించుకోవచ్చు. ఇక నిర్మాణ సమయంలో అల్యూమినియం ప్యానెల్స్ మద్యలో వేడిని ఆపే పదార్దాలను అమర్చుతారు. కాబట్టి ఇవి లోపలి భాగానికి వేడిని రాకుండా చేస్తాయి. దీంతో ఇంట్లో చల్లగా ఉంటుంది. అయితే ఫ్యాక్టరీ నుండి పెద్ద పెద్ద భాగాలను లారీల ద్వారా తీసుకురావడం ఖర్చుతో కూడుకున్నది. అలాగే వీటిని అమర్చడానికి నైపుణ్యం, శిక్షణ పొందిన వారు మాత్రమే అవసరం.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల, గిరిజన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, లబ్ధిదారులు మధ్యలోనే పనులు ఆపేయకుండా చూడటానికి ప్రభుత్వం ‘షియర్ వాల్ టెక్నాలజీ’ని విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇది కూడా ఒక రకమైన ప్రీ-ఫ్యాబ్రికేటెడ్/అడ్వాన్స్‌డ్ నిర్మాణ పద్ధతి కావడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షల బడ్జెట్ పరిమితిలోపే సుమారు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్,టాయిలెట్‌ నిర్మించవచ్చు.

ఎక్కడ నిర్మించారంటే ..

తెలంగాణ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, మెదక్, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 150 ఇళ్లను ప్రయోగాత్మకంగా నిర్మించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కూడా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో ఈ టెక్నాలజీతో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సరికొత్త సాంకేతికతతో ఇందిరమ్మ ఇళ్లను క్షేత్రస్థాయిలో ఎలా నిర్మిస్తున్నారో చూసిన వాళ్లు తాము కూడా.. తాము కూడా ఈ విధంగా తక్కువ బడ్జెట్‌లో నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీంతో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ గృహ నిర్మాణానికి ఇటీవల ఆదరణ పెరిగింది.

Next Story