- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోయే ప్రమాదం.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫైర్
బీఆర్ఎస్ తప్పిదాల వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సెక్రెటేరియట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ తప్పిదాల వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సెక్రెటేరియట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజ్), అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదులు నిర్మాణపరంగా తీవ్ర అనుమానాస్పద స్థితిలో ఉన్నాయని.. శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తయి జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులు లభించే వరకు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించబోమని స్పష్టం చేశారు. మేడిగడ్డలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. పంపులను ఆన్ చేసే పరిస్థితి లేదని.. పంపులను నడపలేమని పేర్కొన్నారు. మూడు బ్యారేజీలను నిర్వహించవద్దని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నేతలు అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్ సమస్యను సాధారణ ఆపరేషన్ సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రాజకీయాల అంశం కాదని.. ఇంజినీరింగ్, ప్రజల భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును, బ్యారేజీలను ఇంజినీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించి ఉంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో సాగునీటి అనిశ్చితి ఉండేది కాదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అమలు చేసి ఉంటే ఉత్తర తెలంగాణకు సుమారు 80 టీఎంసీల స్థిర నీటి లభ్యత ఉండేదని.. ఎల్‌నినో వంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రాంతానికి భరోసా కలిగేదని తెలిపారు. అయితే.. రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రాజెక్టు రూపకల్పనను మార్చడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
దురాశ వల్లే కాళేశ్వరం సంక్షోభం
దురాశ, స్వల్ప దృష్టి, తప్పుదారి పట్టిన నిర్ణయాల ఫలితమే కాళేశ్వరం సంక్షోభమని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఎన్‌డీఎస్ఏ తుది నివేదిక ప్రకారం మూడు బ్యారేజీల పునాదుల్లో సీకెంట్ పైల్ కట్-ఆఫ్ వాల్‌లలో లోపాలు, సీపేజ్, పైపింగ్, స్టిల్లింగ్ బేసిన్‌ల బలహీనత, ఎనర్జీ డిసిపేషన్ వ్యవస్థల్లో లోపాలు, నీరు చొరబడకుండా ఉండాల్సిన నిర్మాణాల్లో వైఫల్యాలు, నిర్మాణ నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించిందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలోని బ్లాక్-7 పునాదుల కింద ఖాళీలు ఏర్పడటంతో కుంగిపోయిందని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఇలాంటి లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. సమస్య ఒక్క పియర్‌కో, ఒక్క గేటుకో పరిమితం కాలేదని.. మొత్తం పునాది వ్యవస్థ సమగ్రతే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. అవసరమైన మరమ్మతులు చేయకుండా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నదని.. దిగువ ప్రాంతాలైన భద్రాచలం సహా అనేక ప్రాంతాలు ముంపును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. పునరుద్ధరణ కోసం ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నదని మంత్రి తెలిపారు.
2027 ఆగస్టు నాటికి పూర్తిచేస్తాం..
మూడు బ్యారేజీల్లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు దాదాపు 100 బోర్‌హోల్స్, ప్రయోగశాల పరీక్షలు, పారగమ్యత అధ్యయనాలు, హైడ్రాలిక్ మోడలింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ), డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. ఈ అధ్యయనాలను సీడబ్ల్యూపీఆర్‌ఎస్ పుణె, గ్లోబల్ కన్సల్టెంట్ ఏఎఫ్‌ఆర్వై, ఐఐటీ బాంబే సంయుక్తంగా ఎన్‌డీఎస్‌ఏ, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రాథమిక నివేదికల ప్రకారం మూడు బ్యారేజీలకు నిరంతర డయాఫ్రాగం వాల్‌లు నిర్మించడం, స్టిల్లింగ్ బేసిన్‌లను బలోపేతం చేయడం అవసరమయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో పరీక్షలు, డిజైన్ల ఖరారు ప్రక్రియ పూర్తవుతుందని.. వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించి 2027 జూలై-ఆగస్టు నాటికి మూడు బ్యారేజీల పనులు పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అప్పటి వరకు మూడు బ్యారేజీలు ఫ్రీ-ఫ్లో స్థితిలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సమస్యలను ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న గేట్ల వైఫల్యాలతో పోల్చడం సరైంది కాదని అన్నారు. గేటు దెబ్బతినడం ఒక సమస్య అయితే.. బ్యారేజీ పునాది దెబ్బతినడం పూర్తిగా భిన్నమైన ఇంజినీరింగ్ సమస్య అని పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ నివేదికలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు అమలులో తీవ్రమైన విధానపరమైన, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వెల్లడైందని ఉత్తమ్ అన్నారు. మంత్రివర్గ ఆమోదం, డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించి, అనంతరం ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచారని అన్నారు. ఈ అంశాలపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరినట్లు తెలిపారు. మరోవైపు ఉత్తర తెలంగాణకు దీర్ఘకాలిక సాగునీటి భద్రత కల్పించేందుకు తుమ్మిడిహెట్టి నుంచి సుమారు 80 టీఎంసీల నీటిని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ రూపొందించే బాధ్యతను ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై ముందుకు సాగుతామని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, ప్రముఖ టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఈఎన్సీ (జనరల్) రమేశ్‌బాబు, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






