- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రాన్ని సుందరీకరించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ పనులు సగంలోనే నిలిచిపోవడంతో విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు రహదారి పక్కనే అస్తవ్యస్తంగా ఉండిపోయాయి. రోడ్డుపై పేరుకుపోయిన కంకర, రాళ్ల కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో తగిన వెలుతురు లేక ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భక్తులు, వ్యాపారులకు ఇబ్బందులు ..
మండల కేంద్ర పరిసరాల్లోని పలు దేవాలయాలకు సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే రహదారిపై ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన వ్యాపారాలు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులు కూడా దుమ్ము కారణంగా వ్యాపారం దెబ్బతింటోందని, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
బిల్లుల చెల్లింపులే జాప్యానికి కారణమా..?
పనులు నిలిచిపోవడానికి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో చేసిన పనులకే బిల్లులు రాకపోతే కొత్త పనులు ఎలా పూర్తి చేయాలనే ఆందోళన కాంట్రాక్టర్లలో ఉందని చెబుతున్నారు.
త్వరగా పూర్తి చేయాలని డిమాండ్..
నిలిచిపోయిన పనులను పూర్తిచేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సెంట్రల్ లైటింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






