- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నాయకులను ప్రజలు ఇక నమ్మరు : మంత్రి సీతక్క
బీఆర్ఎస్ నాయకుల అవినీతి పాలనకు కాలేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని, ప్రాజెక్టుల పేరుతో ఆ పార్టీ నాయకులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : బీఆర్ఎస్ నాయకుల అవినీతి పాలనకు కాలేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని, ప్రాజెక్టుల పేరుతో ఆ పార్టీ నాయకులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ నాయకులను నమ్మరని, వారికి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైనది కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా తెలిపినప్పటికీ, స్వలాభం కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టును నిర్మించారని, ఫలితంగా నేడు అది పనికిరాని స్థితికి చేరుకుందని విమర్శించారు.
మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయవద్దని నిపుణులు హెచ్చరించినప్పటికీ, అప్పటి పాలకులు పట్టించుకోలేదని అన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ, మునిగిపోయిన మోటార్లే వారి అవినీతి పాలనకు నిదర్శనాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రభుత్వం కాదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నింపి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి కేటీఆర్, కేసీఆర్ బాధ్యత వహిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. నీటి విషయంలో తండ్రి-కొడుకులు ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కాలేశ్వరం వంటి ప్రాజెక్టులు నీళ్ల ఎత్తిపోతల పథకాలు కావని, బీఆర్ఎస్ నాయకులకు నిధుల ఎత్తిపోతల పథకాలుగా మారాయని ఆరోపించారు.
రాష్ట్రంలో బావా-బామ్మర్దుల మధ్య కొత్త పోటీ మొదలైందని, ప్రభుత్వాన్ని ఎవరు ఎక్కువగా విమర్శిస్తే వారికి పార్టీ పగ్గాలు దక్కుతాయన్న ఉద్దేశంతో ఇద్దరూ పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరుతో రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, కమిషన్ల కోసం డిజైన్లు మార్చి, రివర్స్ పంపింగ్ పేరుతో తెలంగాణపై వేల కోట్ల రూపాయల భారం మోపింది బీఆర్ఎస్ నాయకులేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీల నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వారిని నమ్మరని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






