కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరం : కేటీఆర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-05 12:06:35  IST  )

హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు వస్తున్న తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని, అన్ని అడ్డంకుల్ని దాటుకుని కన్నెపల్లి వద్దకు చేరుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు.

కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరం : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు వస్తున్న తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని, అన్ని అడ్డంకుల్ని దాటుకుని కన్నెపల్లి వద్దకు చేరుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. బీఆర్ఎస్ నేతలతో ఆదివారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకున్న ఆయన.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్‌, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్‌లో అడుగడుగునా తమను అడ్డుకున్నారని, పైనుంచి తమకు ఆదేశాలున్నాయి పోనివ్వమని చెప్పారన్నారు. రాజకీయ కక్ష తీర్చుకునేందుకు తాము ఇక్కడికి రాలేదని, నీళ్లకోసం దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాన్ని గుర్తుచేసేందుకు వచ్చామని స్పష్టం చేశారు.

బీడు భూములకు కూడా నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ కాళేశ్వరం నిర్మిస్తే.. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని కిందికి వదిలేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నుంచి వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఓ వైపు ఎల్ నినో హెచ్చరికలు వస్తున్నా.. రైతుల గురించి ఏమీ పట్టనట్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపైనే తెలంగాణ ప్రజలు పోరాడారని, కింద ఉన్న నీటిని లిఫ్ట్ ద్వారా తరలిస్తేనే నీళ్లు రాని పరిస్థితి ఉండటంతో ఆనాడు కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు. పల్లపు ప్రాంతం నుంచి ఎగువకు నీటిని తరలించిన ఘనత కేసీఆర్ దే అన్నారు. గోదావరి నీటిని ఒడిసిపట్టి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లాలని పరిశోధించి మరీ బృహత్తర ప్రణాళిక చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి దశాబ్దాల కాలంగా వింటున్నామని, బహుశా అది 2028లో పూర్తి కావొచ్చన్న కేటీఆర్.. కాళేశ్వరాన్ని కేసీఆర్ నాలుగేళ్లలోనే నిర్మించి చూపించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాతి ప్రభుత్వాలు కూడా నేటికీ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయాయని విమర్శించారు. మండుటెండలో, కరువులోనూ నీరు లభ్యత ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించామని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం అంటే.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్ల సమాహారమని గుర్తు చేశారు. 21 పంపుహౌస్‌లు, సబ్‌స్టేషన్లు, 1531 కి.మీ. కాల్వలు అన్నీ కాళేశ్వరంలో భాగమేనన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే ఇప్పటివరకూ మరమ్మతులు చేయలేదని, ఒక్కో బ్లాక్ ను నిర్మించేందుకు రూ.400 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. వాటిని మరమ్మతు చేసేందుకు ఎల్ అండ్ టీ ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మరమ్మతులు చేయడం మానేసి కాళేశ్వరం కూలేశ్వరం అయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు.

మూడు కాలాలూ తట్టుకుని నిలబడేలా కాళేశ్వరం కట్టినామని కేటీఆర్‌ తెలిపారు. నీళ్ల లభ్యత ఎక్కడా లేకపోతే కన్నెపల్లి నుంచి తీయవచ్చని, ఎస్‌ఆర్‌ఎస్పీలోనూ నీళ్లు లేకుంటే రివర్స్‌ పంపింగ్‌లో నీళ్లు నింపుకోవచ్చని వివరించారు. కరువు పరిస్థితుల్లోనూ నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం కన్నెపల్లి అని, ఇక్కడి నుంచి 98 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. 7 జిల్లాలకు సాగునీళ్లు, తాగునీళ్లిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం.. కాకతీయ కాల్వల్లో నీళ్లు లేని పరిస్థితుల్లో నీళ్లిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పర్‌ మానేరులో అలుగు పొంగిందంటే కాళేశ్వరం వల్లనే అన్నారు. సీఎం రేవంత్‌కు ఎలాగూ సోయి లేదు.. మంత్రి ఉత్తమ్‌కు కూడా తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులపై స్పృహ లేదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదు? అని నిలదీశారు. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధత వల్ల ఎస్‌ఎల్‌బీ టన్నెల్‌ కుప్పకూలి 8 మంది మృతి చెందితే.. ఇంతవరకూ మృతదేహాలు తీయలేని పరిస్థితి నెలకొందన్నారు.

కేసీఆర్‌పై కక్షతో రైతులను గోస పెడుతున్నారని, కన్నెపల్లి గేట్‌లు ఎత్తితే నీళ్లు వస్తాయని కాంగ్రెస్‌ నాయకులకూ తెలుసన్నారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి.. పంటలు పండితే మద్దతు ధర ఇవ్వాలి.. పంట పండితే కరెంటు ఇవ్వాలి, బోనస్‌ ఇవ్వాలని సీఎం భయపడుతున్నాడని, అందుకే నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అన్నారు. చేతకాకపోతే కేసీఆర్ కు వారంరోజులపాటు కాళేశ్వరాన్ని అప్పజెప్పాలని, తెలంగాణ మొత్తానికీ నీళ్లు పారించి చూపుతామని కేటీఆర్ చాలెంజ్ చేశారు.

Next Story