డీఎస్పీ భీం రెడ్డి డైరీలో ‘చార్ ధామ్’ యాత్ర రహస్యం..

by Kodari Anjali |

డీఎస్పీ భీం రెడ్డి ఏసీబీ దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

డీఎస్పీ భీం రెడ్డి  డైరీలో ‘చార్ ధామ్’ యాత్ర రహస్యం..
X

దిశ, సిటీక్రైం: ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తులను అవినీతి కార్యకలాపాలతో కూడబెట్టాడనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు పోలీసు శాఖలోని పోలీసు కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్న డీఎస్పీ భీంరెడ్డి ఇంటితో పాటు మరో 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో దాదాపు బహిరంగ మార్కెట్ విలువ చేసే 200 కోట్ల పైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భీంరెడ్డికి సంబంధించిన ఓ డైరీ దొరకడంతో ఏసీబీ అధికారులకు కష్టం లేకుండా భీం రెడ్డి తన సొంత రైటింగ్‌తో రాసుకున్న ఆస్తుల చిట్టా సులువుగా అధికారులకు చిక్కింది.

చార్ ధామ్ యాత్ర భయపెట్టించిందా..

భీం రెడ్డి తన భార్యతో కలిసి మే నెలలో చార్ ధామ్ యాత్రకు వెళ్ళాడు. అయితే ఈ యాత్రకు వెళ్ళే ముందు భీం రెడ్డి ఓ డైరీ తీసుకువచ్చాడు. చార్ ధామ్ యాత్రలో తరచు చోటు చేసుకునే సంఘటనలతో భీం రెడ్డి ముందు జాగ్రత్త పడ్డాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే భీంరెడ్డి యాత్రకు బయలుదేరే ముందు తాను కొనుగొలు చేసుకున్న డైరీలో మొత్తం ఆస్తుల చిట్టాతో పాటు అవి ఎవరెవరికి చెందాలో కూడా రాసుకున్నాడు.

మధ్యవర్తులను కూడా ఇరికించేశాడు...

భీం రెడ్డి స్నేహితులతో పాటు హోంగార్డు, వాచ్ మెన్ లు కూడా బినామీలుగా ఉన్నారు. అయితే ఏదైనా తేడా వస్తే బినామీలు అడ్డంగా తిరిగే అవకాశం ఉందని అనుమానించి బినామీల పేరు మీదు ఆస్తులను తీసుకుంటున్న సమయంలో వాటికి సాక్షిగా మరికొందరిని ఆయన మధ్యవర్తులుగా పెట్టించి వారి సంతకాలను తీసుకున్నాడు. ఆ వివరాలు, మధ్యవర్తులు ఎవరు వారి ఫోన్ నెంబర్లు, చిరునామాలను కూడా రాసుకున్నాడు. ఇలా భీం రెడ్డి దాదాపు 20 ఆస్తులకు సంబంధించిన వివరాలను ఆ డైరీలో పాయింట్ టూ పాయింట్ రాసుకున్నాడని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.

డైరీలో చిట్టా వాట్సాప్‌లో కొడుకులకు షేర్..

యాత్రకు వెళ్ళే ముందు రాసుకున్న ఆస్తుల చిట్టాను భీంరెడ్డి వాటిని వాట్సాప్ ద్వారా ఆయన ఇద్దరు కొడుకులకు పంపించాడు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరెవరికి ఏ ఆస్తి చెందుతుంది, తన స్నేహితులకు ఏ ఆస్తు చెందుతుంది, తనకు రావాల్సిన నగదు, తాను చెల్లించాల్సిన కొన్ని అప్పుల వివరాలను సైతం వాటిని కొడుకులకు వాట్సాప్ లో షేర్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

నాలుగు ఫోన్లు, డైరీ స్వాధీనం...

భీంరెడ్డి ఆస్తుల చిట్టాను దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ఆయనకు సంబంధించిన నాలుగు ఫోన్‌లతో పాటు తాను రాసుకున్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫోన్ లతో పాటు డైరీలో రాసుకున్న ఆస్తుల చిట్టాలోని ఆస్తుల పత్రాలను సేకరిస్తున్నామని అధికారులు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Next Story