వికటించిన ఉదయనిధి స్టాలిన్ 'సనాతన' వ్యతిరేక రాజకీయం.. డీఎంకే ఘోర ఓటమికి ఆ వ్యాఖ్యలే కారణమా?

by Malleboina Mahesh |

తమిళనాడులో డీఎంకే ఓటమికి ఉదయనిధి స్టాలిన్ గతంలో హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలే కారణమనే చర్చ మొదలైంది. సీఎం స్టాలిన్ సహా మంత్రుల వెనుకంజతో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది.

వికటించిన ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యతిరేక రాజకీయం.. డీఎంకే ఘోర ఓటమికి ఆ వ్యాఖ్యలే కారణమా?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీ (DMK party)కీ ఊహించని షాక్ తగిలింది. సీఎం స్టాలిన్ సహా 28 మంది మంత్రులు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతూ.. చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) 'సనాతన' వ్యతిరేక రాజకీయం (Anti-'Sanatana' politics) తెరమీదకు వచ్చింది. ఆయన డిప్యూటీ సీఎంగా హిందూ ధర్మం పై అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం.. సనాతన ధర్మం పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే తాజా ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూ ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌తో పోలుస్తూ, దానిని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి.

ఈ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఓటర్లలో డీఎంకే పట్ల తీవ్ర వ్యతిరేకత పెరగడానికి దారితీసిందని తెలుస్తోంది. మరోవైపు, ముఖ్యమంత్రి స్టాలిన్ సహా 28 మంది మంత్రులు వెనకంజలో ఉండటం డీఎంకే పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని స్పష్టం చేస్తోంది. హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం వల్ల కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ఓటర్లు కూడా డీఎంకేకు దూరమయ్యారని ఎర్లీ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోవడం, మతపరమైన అంశాలపై చేసిన వ్యాఖ్యలు వికటించడమే ఉదయనిధి డీఎంకే పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story