అసిస్టెంట్ లైన్మెన్ నిర్లక్ష్యం.. ఇద్దరు కార్మికులకు విద్యుత్ షాక్..

by Batti.Sumithra |

పట్టణ పరిధిలో విద్యుత్ లైన్ పనుల సందర్భంగా ఎల్‌సీ (లైన్ క్లియర్) రిటర్న్ చేసిన ఘటనలో ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్‌కు గురై గాయపడిన సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసిస్టెంట్ లైన్మెన్ నిర్లక్ష్యం.. ఇద్దరు కార్మికులకు విద్యుత్ షాక్..
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : పట్టణ పరిధిలో విద్యుత్ లైన్ పనుల సందర్భంగా ఎల్‌సీ (లైన్ క్లియర్) రిటర్న్ చేసిన ఘటనలో ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్‌కు గురై గాయపడిన సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్ (50), ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ నగర్‌లోని రాయపూడి లోకనాథం వెంచర్‌లో విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను తనకు చెందిన 10 మంది కార్మికులతో సూపర్వైజర్ హరీష్ ఆధ్వర్యంలో చేపట్టారు.

పనులు ప్రారంభించే ముందు అసిస్టెంట్ లైన్‌మన్ ఆవుల కృష్ణ ద్వారా ఎల్‌సీ తీసుకుని పనులు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ లేదా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసిస్టెంట్ లైన్‌మన్ ఎల్‌సీని రిటర్న్ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో విద్యుత్ స్తంభం పై పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికులు రూబెల్ హుస్సేన్, అస్త్రపుల్ మియా విద్యుత్ షాక్‌కు గురై కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు కార్మికులను వెంటనే మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై ఉప్పల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Next Story