పామాయిల్‌ ఫ్యాక్టరీలో పేలిన వ్యూ గ్లాస్‌.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

పామాయిల్‌ ఫ్యాక్టరీలో పేలిన వ్యూ గ్లాస్‌.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు
X

దిశ, దమ్మపేట: మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కార్మికులు, వేడి నీళ్లు ఒంటిపై పడి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. ఫ్యాక్టరీలోని ఎంఈఈ (మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్) విభాగంలో రాత్రి 11 గంటల సమయంలో వాటర్ లైన్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఆపరేషనల్ మెయింటెనెన్స్ సిబ్బంది శివరాం, గణేష్ అక్కడకు చేరుకుని లైన్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పైపునకు అమర్చి ఉన్న వ్యూ గ్లాస్ ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో అందులోని తీవ్రమైన వేడి నీళ్లు ఇద్దరు కార్మికుల మెడ, వీపు, చేతులపై పడటంతో చర్మం కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు తన సిబ్బందితో కలిసి స్పందించి, క్షతగాత్రులను సత్తుపల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం గంటలకు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండటంతో, తమ వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ తరలించాలని యాజమాన్యాన్ని కోరారు. దీంతో స్పందించిన అధికారులు ప్రైవేట్ అంబులెన్స్‌లో క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.

Next Story