20 రోజులకు చేరుకున్న వాంగ్ చుక్ నిరాహార దీక్ష.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు

by Ajay Maddhiboyina |

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 20 రోజులకు చేరుకుంది. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్ చుక్ నిరాహారదీక్ష ప్రారంభించారు.

20 రోజులకు చేరుకున్న వాంగ్ చుక్ నిరాహార దీక్ష.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు
X

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 20 రోజులకు చేరుకుంది. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్ చుక్ నిరాహారదీక్ష ప్రారంభించారు. 19 రోజుల్లోనే వాంగ్ చుక్ 9 కేజీల బరువు తగ్గగా అతడి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక మరో 48 గంటలు దీక్ష కొనసాగితే వాంగ్ చుక్ ప్రాణాలకే ప్రమాదం ఉందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అతడి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఆయనకు బలవంతంగా ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ ఇష్యూపై ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది.

వాంగ్ చుక్ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో ఎలాంటి వైద్య చికిత్సలైనా అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతిపౌరుడి ప్రాణం అమూల్యమైందని, అలాంటి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా వాంగ్ చుక్ కు చికిత్స అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే నీట్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ తో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై దేశవ్యాప్తంగా కనీసం 12 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం పట్టించుకోవడంలేదు. మరోవైపు వాంగ్ చుక్ నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.

Next Story