కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాలపై పిల్ (PIL) తిరస్కరణ

by Malleboina Mahesh |

కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపుపై దాఖలైన పిల్ విచారణను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు!

కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాలపై పిల్ (PIL) తిరస్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హీరో విజయ్ టీవీకే పార్టీ మీటింగ్ సందర్భంగా కరూర్ (Karur) జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. కాగా టీవీకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) ను విచారించడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఎన్. ప్రభాకరన్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం.. సదరు పిటిషనర్ దాఖలు చేసిన ఈ అభ్యర్థన ప్రస్తుతం నిరర్థకమైనదని (Infructuous) స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన ప్రధాన కేసు ఇప్పటికే హైకోర్టుకు చెందిన 'మదురై బెంచ్' (Madurai Bench) విచారణలో ఉందని న్యాయస్థానం గుర్తుచేసింది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ నియామకాలు అన్నీ కూడా మదురై బెంచ్‌లో నడుస్తున్న కేసు తుది తీర్పుకు లోబడే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఒకే అంశంపై మరో బెంచ్‌లో విచారణ సాగుతున్నందున, ఈ తాజా పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంటూ కోర్టు దీనిని తోసిపుచ్చింది.

Next Story