- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు.. ‘SIR’పై విచారణ వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించినంత మాత్రాన సదరు వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయవచ్చా? అని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించినంత మాత్రాన సదరు వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయవచ్చా? అనే అత్యంత కీలకమైన అంశాన్ని పరిశీలించడానికి భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) అంగీకరించింది. పశ్చిమ బెంగాల్‌లో సాగుతున్న 'ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాల నుంచి తొలగించబడిన వారికి రేషన్, ఇతర సామాజిక భద్రతా పథకాలను నిరాకరించకూడదని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈ మేరకు ధర్మాసనం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (EC)తో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును జూలై 25 కు వాయిదా వేసింది.
పిటిషనర్ అభ్యర్థన ఏమిటి?
ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రసేన్‌జిత్ బోస్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించినంత మాత్రాన ప్రజలకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS/రేషన్), అన్నపూర్ణ పథకం, కుల ధృవీకరణ పత్రాలు, ఇతర సామాజిక పింఛన్లు వంటి ప్రాథమిక ప్రయోజనాలను నిలిపివేయడం సరికాదని వాదించారు. పౌరసత్వం, ఓటు హక్కుకు సంబంధించిన వివాదాలు తుది కొలిక్కి వచ్చే వరకు పేద ప్రజలను సంక్షేమ పథకాల నుంచి దూరం చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ బలమైన వాదనలు వినిపించారు. "పశ్చిమ బెంగాల్లోని ప్రత్యేక ట్రిబ్యునళ్ల ముందు ప్రస్తుతం దాదాపు 34 లక్షల అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ, కేవలం 38,000 అప్పీళ్లను మాత్రమే ఇప్పటివరకు పరిష్కరించారు. దీనికి తోడు రాష్ట్రంలో ఈ అప్పీళ్లను డీల్ చేయడానికి కేవలం 19 ట్రిబ్యునళ్లు మాత్రమే ఉన్నాయి. అందులోనూ ఇద్దరు జడ్జీలు ఇప్పటికీ రాజీనామా చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు, అప్పీళ్లపై తుది నిర్ణయం రాకముందే లబ్ధిదారులకు పథకాలు నిలిపివేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట్రిబ్యునల్స్ పనితీరులో పారదర్శకత ఉండాలని, వాటి కోసం ప్రత్యేక వెబ్సైట్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆర్డర్లను అప్లోడ్ చేయాలని కోరారు. "ఒక వ్యక్తి వద్ద భారత పాస్పోర్ట్ ఉంటే దానిని పౌరసత్వానికి రుజువుగా అంగీకరించాలి. మళ్లీ మరిన్ని డాక్యుమెంట్లు అడగడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల సంఘానికి పౌరసత్వాన్ని తేల్చే అధికారం లేదు..
సుప్రీంకోర్టు ఈ వాదనలపై జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ, గతంలో బిహార్ SIR ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు. "ఓటు హక్కుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే క్రమంలో ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదు. ఆ విషయాన్ని ఈసీ కేవలం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మాత్రమే రిఫర్ చేయాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు. అయితే చట్ట ప్రకారం ఓటర్ల జాబితాపై పూర్తి పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు మాత్రమే ఎన్నికల సంఘానికి ఉంటాయని కోర్టు పునరుద్ఘాటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమకు ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి, బాధితుల పౌరసత్వ వివాదాలు తేలే వరకు వారి సెంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని పిటిషనర్ కోరగా, దీనిపై తదుపరి విచారణలో సమగ్రంగా పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.






