ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం.. 886 ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-17 09:58:20  IST  )

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఆరోగ్య పథకం (EHS) ప్రారంభమైంది.

ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం.. 886 ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారికంగా ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ఉద్యోగులకు నూతన హెల్త్ కార్డులను డిప్యూటీ సీఎం అందజేశారు.

ఉద్యోగులంతా మన బిడ్డలే..

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక నూతన అధ్యాయం మొదలైందని ఆనందం వ్యక్తం చేశారు. ‘గతంలో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని ఉద్యోగులు తమ బాధలను మాతో పంచుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు. అందుకే ఉద్యోగులందరినీ మన బిడ్డలుగా భావించి, వారికి పూర్తి భరోసానిచ్చేలా ఈ అత్యుత్తమ ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేసింది’ అని ఆయన పేర్కొన్నారు.

నేటి నుంచే ఐడీ కార్డులు..

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ పథకం యొక్క పూర్తి వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నేటి నుంచే ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు ప్రత్యేక హెల్త్ ఐడీలను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నూతన పథకం (EHS) కింద రాష్ట్ర వ్యాప్తంగా 886 నెట్‌వర్క్ ఆసుపత్రులలో పూర్తిగా నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉంటాయి. దాదాపు 1,816 రకాల వైద్య చికిత్సలు, ఆపరేషన్లను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. వీటికోసం ఉద్యోగులు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు మరింత చేరువగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 24 వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు.

Next Story