భర్త ఎఫైర్ పెట్టుకుంటే వదిలేయండి పెద్ద ఇష్యూ చేయొద్దు.. దుమారం రేపుతున్న జీవిత కామెంట్స్

by Mallepaka Hamsa |

భార్యకు తెలియకుండా, రహస్యంగా ఎఫైర్ పెట్టుకుంటే దాని గురించి భార్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

భర్త ఎఫైర్ పెట్టుకుంటే వదిలేయండి పెద్ద ఇష్యూ చేయొద్దు.. దుమారం రేపుతున్న జీవిత కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రాజశేఖర్ భార్య, నటి జీవిత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. తన భర్తకు అన్ని విషయాల్లో తోడుగా నిలుస్తూ వస్తున్నారు. నటనకు దూరం అయినా.. సామాజిక అంశాలపై మాత్రం సెన్సేషనల్ కామెంట్స్ చెేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొని భార్యాభర్తల బంధాలు, వివాహేతర సంబంధాలపై జీవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఈ రోజుల్లో ఎవరూ శ్రీరామచంద్రుడిలా ఉండరని, తాను చేసే టీవీ షోలలోనూ ఇదే విషయాన్ని చెబుతుంటానని జీవిత స్పష్టం చేశారు. ఒక పురుషుడు వేరే మహిళతో పబ్లిక్‌గా తిరుగుతూ, తనకు అఫైర్ ఉందని బహిరంగంగా చెబితే.. అలాంటి వాడితో ఏ భార్య కూడా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, కేవలం ఒక చిన్న అట్రాక్షన్‌తో భార్యకు తెలియకుండా, రహస్యంగా ఎఫైర్ పెట్టుకుంటే దాని గురించి భార్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

భార్యను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ విషయాన్ని దాచాడని, మనం ప్రతిరోజూ ఒకే హోటల్‌లో భోజనం చేయం, ఒకే రకమైన బట్టలు వేసుకోం కదా.. అలాగే ఏదో కొత్తదనం కోసం భర్త ఆ తప్పు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ విషయం తర్వాత తెలిసినా సరే, దానిని పెద్ద ఇష్యూ చేయకుండా వదిలేయడమే మంచిదని హితవు పలికారు. కానీ, ఇంకో పెళ్లి చేసుకుని, వేరే ఫ్యామిలీ పెట్టి, మొదటి భార్యాపిల్లలను రోడ్డున పడేస్తే మాత్రం అలాంటి వాడిని అస్సలు క్షమించొద్దని చెప్పారు. భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలన్నప్పుడు, భార్య కూడా అలాగే చేస్తే మొగుడు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని, ఆమెను కూడా క్షమించాలని స్పష్టం చేశారు. తన దగ్గరకు ఇలాంటి కేసులు చాలానే వచ్చాయని తెలిపారు. పూర్వం మగాడు బయటకు వెళ్లి సంపాదిస్తాడు కాబట్టి వాడే గొప్ప అనేవారని.. కానీ బయటకు వెళ్లి సంపాదించడం ఎంత పెద్ద పనో, ఇంట్లో ఉండి కుటుంబాన్ని చక్కబెట్టడం అంతకంటే పెద్ద పనని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జీవిత కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

Next Story