యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

by Taduka Kalyani |

యువ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.

యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి : ఉప్పల శ్రీనివాస్ గుప్తా
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : యువ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో నిర్వహిస్తున్న యోనెక్స్ సన్‌రైజ్ 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ (అండర్-15) బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026 మణికొండ మ్యాచ్ పాయింట్ ప్రైడ్ వేదికగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా జీ వెంకటరావుతో కలిసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ షట్లర్లకు ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీలు తమ ప్రతిభను చాటుకునేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావం, క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు మరిన్ని విజయాలు, పతకాలు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి మ్యాచ్‌ను అనుభవంగా స్వీకరించి ఆత్మవిశ్వాసంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని క్రీడాకారులకు సూచించారు. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అండర్ 15 బాలబాలికలు సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సలహాదారు కొసరాజు లక్ష్మణ్, కోశాధికారి కానూరి వంశీధర్, సంయుక్త కార్యదర్శులు యూవీఎన్ బాబు, సాంకేతిక నిపుణుల కమిటీ కన్వీనర్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సామా ప్రభాకర్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్ జయంత్, శ్రీకాంత్ రెడ్డి, ఏ.వి. రమణారెడ్డి, సందీప్, ముప్పాళ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.

Next Story