జాతీయ మహిళా షూటర్‌ అదృశ్యం

by Muthe.Rajitha |

పశ్చిమ బెంగాల్‌లో జాతీయ మహిళా షూటర్ అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది.

జాతీయ మహిళా షూటర్‌ అదృశ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో జాతీయ మహిళా షూటర్ అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. 15 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్ దమయంతి సేన్ అనుమానాస్పద స్థితిలో మిస్ అయింది. ఈ ఘటన క్రీడా వర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఇంటికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం కోసం దమయంతి హావ్‌డా (Howrah) లోని తన నివాసం నుంచి బయటకు వెళ్ళింది. అయితే, ఎంత సమయం గడిచినా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడం, మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హావ్‌డా పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో హావ్‌డా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 4, 5 వద్ద దమయంతి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

ఆమెకు సంబంధించిన చివరి సమాచారం ఇదే కావడంతో, ఆమె ఎక్కడికైనా రైలులో ప్రయాణించిందా? ఎవరైనా ఆమెను బలవంతంగా తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దమయంతి సేన్ ఇటీవలనే అద్భుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టు (National Team) ట్రయల్స్‌కు ఎంపికైంది. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న తరుణంలో ఈ యువ క్రీడాకారిణి అదృశ్యం కావడం భారత షూటింగ్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), జీఆర్పీ (GRP) బలగాల సహాయంతో రైల్వే స్టేషన్ పరిసరాలను, రైళ్ల రూట్లను జల్లెడ పడుతున్నారు. దమయంతిని సురక్షితంగా రక్షించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు హావ్‌డా పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Next Story