రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

by Kodari Anjali |

తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో నాన్ కెడస్ట్రాల్ రీసర్వే పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మొదట పరిశీలించారు.

రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా
X

దిశ, తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో నాన్ కెడస్ట్రాల్ రీసర్వే పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మొదట పరిశీలించారు. రీ సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి లో ఇప్పటి వరకు ఎంత విస్తీర్ణంలో రీ సర్వే పూర్తయింది, ఇంకా ఎంత మేర చేపట్టాల్సి ఉంది, పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో భూమి విస్తీర్ణం ఎంత ఉందని ఆరా తీశారు. సర్వే నంబర్ల వారీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.

ఒక్కొక్క రైతు వారిగా రీ సర్వే..

ఈ రీసర్వేలో భాగంగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక సర్వే పరికరాల సహాయంతో వ్యవసాయ భూములను సర్వే చేయనున్నట్లు చెప్పారు. సర్వే పూర్తయిన అనంతరం భూ వివరాలను ప్రజలకు ప్రకటిస్తామని పేర్కొన్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మొదట గ్రామ బౌండరీ పై లైసెన్సుడ్ సర్వేయర్లు, మండల సర్వేలు కలిసి రీ సర్వే చేస్తారని. తర్వాత ఒక్కొక్క రైతు వారిగా రీ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మొదటి విడతగా 70 గ్రామాల్లో రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం 7 గ్రామాల్లో ఎంజాయ్మెంట్ రీసర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో నాన్ కెడస్ట్రాల్ రీ సర్వే చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ షర్మిల తహసీల్దార్లు శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story