విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్, ఆయాలకు షోకాజ్ నోటీస్ జారీ

by Kodari Anjali |

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్, ఆయాలకు షోకాజ్ నోటీస్ జారీ
X

దిశ, కౌకుంట్ల: కౌకుంట్ల మండలంలోని పుట్టపల్లి, పేరూరు గ్రామాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పుట్టపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. బోర్డుపై రాసిన అక్షరాలను విద్యార్థులతో చదివించి వారి విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలు తెలుసుకోవడంతో పాటు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. తదుపరి పుట్టపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి హాజరవుతున్న గర్భిణుల సంఖ్య, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం పేరూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ల్యాబ్ సిబ్బంది వివరాలు, రోజువారీ పరీక్షల సంఖ్య, సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనే విషయాలను వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ గర్భిణితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు.

పరిశుభ్రత లోపాలను గుర్తించి..

అనంతరం పేరూరులోని పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేసి పశువులకు అవసరమైన మందులు, టీకాలు అందిస్తున్నారా లేదా పరిశీలించారు. పశు వైద్య కేంద్రం కేంద్రం సమీపంలోని మురుగు కాలువ అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే కాలువను శుభ్రం చేసి ఫొటోలు పంపించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పేరూరు అంగన్‌వాడీ 3 కేంద్రంలో తనిఖీ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం ఆహారం అందించకుండా కేవలం అన్నం, నీళ్ల చారు మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే కేంద్రంలో పరిశుభ్రత లోపాలను గుర్తించి సంబంధిత అంగన్‌వాడీ టీచర్, ఆయాపై విధుల పట్ల నిర్లక్ష్య వైఖరికి షోకాజ్ నోటీసులు జారీ కి ఆదేశించడంతో జిల్లా సంక్షేమ అధికారి షోకాజ్ నోటీస్ లు జారీ చేశారు. చివరిగా పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సమీపంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించి,విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని,మండల అధికారులు ఉన్నారు.

Next Story