హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ ప్రారంభం

by Vemula.Srinu Prasad |

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అధునాతన సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జలంధర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు....

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అధునాతన సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జలంధర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా హైటెక్ సిటీ స్టేషన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్.రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్. రాంచందర్ రావు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో రూ. 40 వేల కోట్ల రైల్వే పనులు...

కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో రైలు ప్రయాణం భారీ రూపాంతరం చెందిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 40,000 కోట్లకు పైగా విలువైన రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మధ్యతరగతి ప్రజల అవసరాలను తీర్చే విధంగా రైల్వేల మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రధాని ప్రారంభించిన 75 అమృత్ స్టేషన్లలో తమ జోన్ పరిధిలోని హైటెక్ సిటీ స్టేషన్ ఒకటిగా నిలవడం గర్వకారణమని ద.మ.రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ స్టేషన్‌ను కొత్త భవనం, మెరుగైన వెయిటింగ్ హాల్స్, సైనేజ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసినట్లు వివరించారు. తెలంగాణలోని మిగిలిన అమృత్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు కూడా షెడ్యూల్ ప్రకారం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, వేగవంతమైన విద్యుదీకరణతో తెలంగాణ రైల్వే రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని జీఎం పేర్కొన్నారు.

Next Story