- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ‘ఇందూరు రణభేరి’ పేరుతో విద్యార్థుల ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ‘ఇందూరు రణభేరి’ పేరుతో విద్యార్థుల ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నత విద్య అభ్యసించాలనే ఆశ ఉన్నా ఫీజులు చెల్లించే స్థోమత లేని లక్షలాది మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధారణ పథకం కాదని, లక్షలాది పేద కుటుంబాల జీవితాలను మార్చిన సంక్షేమ పథకమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతోందని విమర్శించారు.
ఇందూరు గడ్డపై పుట్టిన ఆలోచనే ఫీజు రీయింబర్స్‌మెంట్..
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆలోచన నిజామాబాద్ (ఇందూరు) నుంచే పుట్టిందని అర్వింద్ పేర్కొన్నారు. 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈ ప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి వివరించి అమలు చేయించారని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు పెద్దఎత్తున ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని అన్నారు. ప్రస్తుతం సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం **రూ.200 కోట్లు** మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. పూర్తి బకాయిలు విడుదల చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు.






