తెలంగాణ విద్యుత్‌కు సింగరేణి భరోసా..72 శాతం బొగ్గు సరఫరా

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు...

తెలంగాణ విద్యుత్‌కు సింగరేణి భరోసా..72 శాతం బొగ్గు సరఫరా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరిగినందున, మరింత ప్రాధాన్యత క్రమంలో ఇంకా ఎక్కువ బొగ్గు రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింగరేణి సీఎండీ, జెన్‌కో సీఎండీ డా. హరీష్ ప్రస్తుత విద్యుత్ డిమాండ్, బొగ్గు ఉత్పత్తి, రవాణా అంశాలపై ఉభయ సంస్థల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దప్రకాష్ మాట్లాడుతూ... రాష్ట్ర థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా ఇరు సంస్థల అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. నిరంతరాయ బొగ్గు రవాణాను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం తెలంగాణలోని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, రామగుండం ఎన్‌టీపీసీ, సింగరేణి థర్మల్ ప్లాంట్ కోసం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 72 శాతాన్ని సరఫరా చేస్తున్నట్లు మార్కెటింగ్ విభాగం అధికారులు తెలిపారు. అయితే విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే బొగ్గు నుంచి సర్దుబాటు చేసి, తెలంగాణ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎండీ స్పష్టం చేశారు. రైల్వే రేకుల లభ్యత, రోడ్డు రవాణా తదితర అంశాల్లో అధికారులు నిరంతరం సమీక్షించుకోవాలన్నారు. వర్షాకాలంలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఏరియా జీఎంలు చర్యలు తీసుకోవాలని, నాణ్యతలో రాజీ పడకుండా ఉత్పత్తిని కొనసాగించాలని ఆదేశించారు. జెన్‌కో సీఎండీ డా. హరీష్ మాట్లాడుతూ... జెన్‌కో థర్మల్ కేంద్రాల వద్ద ఉన్న బొగ్గు నిల్వల వివరాలను వెల్లడించారు. బొగ్గు రవాణాలో ఉన్న స్థానిక ఇబ్బందులను అధికారులు చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు, ఈడీ బి.వెంకన్న, జీఎం టి.శ్రీనివాస్, జెన్‌కో డైరెక్టర్లు నాగ్య, రాజశేఖర్, సీఈలు బిచ్చన్న, లక్ష్మయ్య, శ్రీప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story