రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికే భూముల రీ-సర్వే

by Ratna Kumari |

రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు.

రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికే భూముల రీ-సర్వే
X

దిశ, శాలిగౌరారం : రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో నిర్వహించిన భూ రీ-సర్వే అవగాహన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామసభలో రైతులు బాటలు, దారుల సమస్యలు, పట్టాలు లేకపోవడం, భూమి ఉన్నప్పటికీ కబ్జాలో లేకపోవడం వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భూ రికార్డులను నవీకరిస్తున్నప్పటికీ నక్షాలు, టిప్పన్లు వంటి పాత రికార్డుల్లో మార్పులు లేకపోవడం, క్షేత్రస్థాయిలో భూముల గుర్తింపులో ఇబ్బందులు ఉండటం వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాటి పరిష్కారానికే భూముల రీ-సర్వే చేపట్టినట్లు వివరించారు. రీ-సర్వేలో భాగంగా ముందుగా గ్రామ హద్దులు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయేతర భూములను సర్వే చేసి, అనంతరం రైతులు, గ్రామస్థుల సమక్షంలో వ్యవసాయ భూముల సర్వే నిర్వహిస్తామని చెప్పారు. పహానీ ఆధారంగా ప్రతి భూమికి ల్యాండ్ పార్సెల్ నంబర్ కేటాయించి, అనంతరం అన్ని పార్సెల్‌లను అనుసంధానం చేస్తూ భూదార్ నంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

భూదార్ నంబర్ ఆధారంగా భూముల వివరాలు అందుబాటులోకి వస్తాయని, ముసాయిదా జాబితాను గ్రామంలో ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు. కోర్టు కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు తదితర అంశాలను కూడా పరిశీలించిన తర్వాతే భూముల హద్దులు ఖరారు చేసి మ్యాప్‌లు అందజేస్తామని వివరించారు. రీ-సర్వే ప్రక్రియలో రైతులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని, ఈ ప్రక్రియ ద్వారా కొత్త వివాదాలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కోరారు. అనంతరం స్థానిక కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూనిఫాం సమస్యను విద్యార్థులు ప్రస్తావించగా, రెండు రోజుల్లో టైలర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీఎచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్ రికార్డుల నిర్వహణలో అలసత్వం, సమయపాలన లోపం, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వైద్య సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల ప్రజలకు సరైన వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నల్గొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, తహసీల్దార్ మాధవరావు, ఎంపీడీవో జాల రజిత, తక్కెల్లపహాడ్, శాలిగౌరారం గ్రామాల సర్పంచులు సురేందర్ రెడ్డి, గుజిలాల్ శేఖర్ బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగే నర్సింహా, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story