ఉచిత, నిర్బంధ విద్య అమలే కాంగ్రెస్ లక్ష్యం

by Ratna Kumari |

పేదల విద్య, సంక్షేమం, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు.

ఉచిత, నిర్బంధ విద్య అమలే కాంగ్రెస్ లక్ష్యం
X

దిశ, కొత్తగూడెం సింగరేణి : పేదల విద్య, సంక్షేమం, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు పేదరికం కారణంగా చిన్నారులను తల్లిదండ్రులు కూలీ పనులకు పంపే పరిస్థితులు ఉండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను హక్కుగా మార్చి ఉచిత, నిర్బంధ విద్యను అమలు చేయడం వల్ల నేడు ప్రతి చిన్నారికి పాఠశాలకు వెళ్లే అవకాశం కలిగిందని తెలిపారు.

ముఖ్యంగా బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, కుటుంబాల్లో లింగ వివక్షకు తావివ్వకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అంతరిక్షంలోకి వెళ్లిన మహిళలు, ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలు సాధించిన విజయాలు మహిళల సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఖమ్మం లోక్‌సభ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా అభివృద్ధితో పాటు తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రజా సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత విద్య, ఆరోగ్య సేవలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల సంక్షేమం కోసమే అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, ఓటు హక్కు కోల్పోతే ప్రజాస్వామ్యంలో తమ గొంతును కోల్పోయినట్టేనని అన్నారు.

"రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. దానిని నిర్లక్ష్యం చేయొద్దు. ఓటు అమ్ముకోవడం, ఓటు వేయకుండా ఉండడం ప్రజాస్వామ్యానికి నష్టం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి" అని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని, ప్రజల ఆశీర్వాదంతో ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story