ఆక్రమణకు గురైన భూమిని పేదలకు పంచాలని రాస్తారోకో..

by Taduka Kalyani |   (  Updated:2026-07-17 09:53:28  IST  )

గ్రామకంఠ భూమి ఆక్రమణ తొలగించి భూమిలేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని దండుమైలారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు.

ఆక్రమణకు గురైన భూమిని పేదలకు పంచాలని రాస్తారోకో..
X

దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో సుమారు 4 ఎకరాల గ్రామకంఠ భూమి ఆక్రమణకు గురైందని ఆరోపిస్తూ.. ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని భూమిలేని పేదలకు ఇండ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ ఇదులకంటి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు రూ.20 కోట్ల విలువైన ఈ భూమి అక్రమంగా ఆక్రమించబడిందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తాండూరి జనార్దన్ రెడ్డి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న గ్రామకంఠ భూమిని అక్రమంగా తన పేరుపై మార్చుకున్నారని ఆరోపించారు. గ్రామకంఠ భూములు పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాల్సి ఉండగా, ఒకే వ్యక్తి పేరుపై 9,874 గజాలు ఎలా నమోదైందని ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల ప్రకారం సంబంధిత వ్యక్తి పేరుపై 194 గజాలు మాత్రమే ఉండాల్సి ఉండగా, అప్పటి పంచాయతీ కార్యదర్శితో కుమ్మక్కై రికార్డులను ట్యాంపరింగ్ చేసి 9,874 గజాలుగా నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు

గ్రామంలో వందలాది నిరుపేద కుటుంబాలకు ఇప్పటికీ సొంత ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, గ్రామకంఠ భూములను వారికి కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. గ్రామకంఠ భూములపై జరిగిన అక్రమాలను వెంటనే విచారించి, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో అధికారులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గ్రామకంఠ భూములను పేదలకు కేటాయించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా ఇబ్రహీంపట్నం– విజయవాడ ప్రధాన రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story