Health : లివర్ ఆరోగ్యంగా ఉండాలా? డైలీ ఒక కప్పు కాఫీ తాగండి!

by Javid Pasha |

కాఫీలో ఉండే వివిధ రసాయన సమ్మేళనాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా లివర్‌కు రక్షణ అందిస్తాయి.

Health : లివర్ ఆరోగ్యంగా ఉండాలా? డైలీ ఒక కప్పు కాఫీ తాగండి!
X

దిశ, ఫీచర్స్ : మీ లివర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అయితే డైలీ ఒక కప్పు కాఫీ తాగడానికి ట్రై చేయండి! ఎందుకంటే.. కాలేయ ఆరోగ్యానికి మేలు చేసేవాటిలో ఇది కూడా ఒకటని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్టడీకి సంబంధించిన వివరాలు క్లినికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ & హెపటాలజీ (Clinical Gastroenterology and Hepatology) జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సమస్యలకు చెక్..

అధ్యయనంలో భాగంగా కాఫీ తాగడంవల్ల మానవ ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి లాస్ ఏంజెల్స్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు 3, 54,957 మందిని 13 ఏండ్లపాటు ఫాలో చేస్తూ పరిశీలించారు. ఇందులో కాఫీ తాగే అలవాటు ఉన్నవారిని, తాగని వారిని విడివిడిగా విశ్లేషించారు. అయితే అది కెఫీన్ ఉన్న కాఫీ అయినా లేదా డీకాఫ్ అయినా సరే.. ఏది తాగినా రోజూ కాఫీ తాగనివారితో పోలిస్తే, తాగేవారిలో లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటోందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తులు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా కాఫీ తాగేవారిలో లివర్ క్యాన్సర్, సిర్రోసిస్ (కాలేయం ముద్దగా మారడం), అలాగే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటి సమస్యలు కూడా చాలా తక్కువ రేటుతో ఉన్నట్లు కనుగొన్నారు. మొత్తానికి కాఫీ కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుందని తేల్చారు.

బ్లడ్ షుగర్ నియంత్రణకు..

కాఫీ ఎందుకు మేలు చేస్తుందంటే.. ఇందులో ఉండే వివిధ రసాయన సమ్మేళనాలు శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్)ను తగ్గించడం ద్వారా లివర్‌కు రక్షణ అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా క్లోరోజెనిక్ ఆమ్లం (Chlorogenic acid) అనే సమ్మేళనం కాలేయం ఇన్సులిన్‌కు స్పందించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మొత్తానికి కాఫీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తీసుకోవడమనేది కాలేయ సంరక్షణకు మంచి మార్గమని అధ్యయనాలు సూచిస్తు్న్నాయి. అలాగనీ కాఫీ మాత్రమే లివర్ ఆరోగ్యానికి ప్రత్యామ్నాయ పానీయం కాదు. వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి కొందరికి కాఫీ పడకపోవచ్చు కూడాను. కాబట్టి తాగాలా వద్దా అనేది వ్యక్తిగత ఆసక్తి, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తు్న్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story