ఇస్రో సైంటిస్టుల రాజీనామాకు కారణం ఇదేనా?

by Muthe.Rajitha |

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇస్రో సైంటిస్టుల రాజీనామాకు కారణం ఇదేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇస్రోకు చెందిన సుమారు 100 నుండి 120 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం అంతరిక్ష రంగంలో కలకలం రేపుతోంది. కీలక ప్రాజెక్టుల సమయంలో ఇంతమంది శాస్త్రవేత్తలు ఒకేసారి తప్పుకోవడానికి ప్రైవేట్ అంతరిక్ష రంగం నుండి వస్తున్న భారీ ఆఫర్లే ప్రధాన కారణమని తెలుస్తోంది.

ప్రైవేట్ స్టార్టప్‌ల 'భారీ ప్యాకేజీల' ఆకర్షణ

కేంద్ర ప్రభుత్వం 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి అనుమతించిన తర్వాత దేశంలో ఎన్నో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రైవేట్ సంస్థలు ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను గుర్తించి, ప్రభుత్వ వేతనాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ జీతాలు, మెరుగైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ రంగంలో ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం కావడం, తరచూ వాయిదాలు పడటంతో తమ నైపుణ్యాలు మరుగున పడుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రైవేట్ సెక్టార్‌లో కొత్త ప్రాజెక్టులు శరవేగంగా ప్రారంభం కావడం, నిర్ణీత సమయంలో విజయాలు సాధిస్తుండటం శాస్త్రవేత్తలను అటువైపు ఆకర్షిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అలర్ట్.. కఠిన నిబంధనలు జారీ!

ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ఇలా ప్రైవేట్ సంస్థల వైపు వెళ్లడం వల్ల ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. ఈ మేధోవలసను అడ్డుకునేందుకు ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలకు సంబంధించి కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. ముఖ్యంగా దేశ గర్వకారణమైన 'గగన్‌యాన్' (Gaganyaan), ఇతర కీలకమైన అంతరిక్ష ప్రాజెక్టులపై పనిచేస్తున్న ప్రధాన సైంటిస్టుల రాజీనామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని, వాటికి అనుమతులు నిరాకరించాలని కేంద్ర ప్రభుత్వం ఇస్రో మేనేజ్‌మెంట్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మేధోసంపత్తిని కాపాడుకుంటూనే, కీలక మిషన్లు సజావుగా సాగేలా చూడటం కోసం ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Next Story