పేపర్ కరెన్సీకి చెల్లు.. వచ్చే ఏడాది నుంచే ప్లాస్టిక్ నోట్లు!

by Muthe.Rajitha |

భారతీయ కరెన్సీ రంగంలో సరికొత్త విప్లవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టబోతోంది.

పేపర్ కరెన్సీకి చెల్లు.. వచ్చే ఏడాది నుంచే ప్లాస్టిక్ నోట్లు!
X

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ కరెన్సీ రంగంలో సరికొత్త విప్లవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టబోతోంది. మార్కెట్లోకి త్వరలోనే అత్యంత మన్నికైన, అత్యాధునిక 'పాలిమర్ నోట్లు' (Plastic Currency) రంగప్రవేశం చేయనున్నాయి. సాంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో ఈ కొత్త తరహా ప్లాస్టిక్ కరెన్సీని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర బ్యాంక్ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2027 నాటికి ఈ సరికొత్త నోట్లను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా సామాన్యుడి వినియోగంలోకి తీసుకురావాలన్నది ఆర్‌బీఐ ప్రధాన ఆలోచనగా ఉందని జాతీయ మీడియా సంస్థ 'ఎన్డీటీవీ ప్రాఫిట్' తన తాజా కథనంలో ప్రత్యేకంగా పేర్కొంది. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా ఆర్‌బీఐ తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) రూపంలో తక్కువ ముఖ విలువ కలిగిన రూ. 10 మరియు రూ. 20 నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ప్రయోగాత్మక చలామణీ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్, క్షేత్రస్థాయి సవాళ్లు మరియు సాధకబాధకాలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన మార్పులతో 2027 నాటికి పూర్తి స్థాయి ముద్రణను ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పాలిమర్ నోట్లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం చలామణీలో ఉన్న పాత పేపర్ కరెన్సీ ఎప్పటిలాగే చెల్లుబాటు అవుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని, దశలవారీగా మాత్రమే పాత నోట్ల స్థానాన్ని ఈ పాలిమర్ నోట్లు భర్తీ చేస్తాయని స్పష్టమవుతోంది.

టెండర్ల ప్రక్రియ షురూ

ఈ వినూత్న పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల అధికారికంగా వెల్లడించడం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సరికొత్త కరెన్సీ నోట్లను ముద్రించడానికి ఉపయోగించే అత్యంత ప్రత్యేకమైన పదార్థమైన 'పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల' (Polymer Substrate Sheets) తయారీకి ఆర్‌బీఐ నోట్ల ముద్రణా విభాగం (BRBNMPL) ఇప్పటికే టెండర్లను కూడా జారీ చేసింది. ఆయా అంతర్జాతీయ సరఫరాదారులు ఆగస్టు 18 నాటికి తమ బిడ్లను దాఖలు చేయాలని ఆర్‌బీఐ సూచించడంతో ఈ సరికొత్త కరెన్సీ రాకపై వస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నకిలీ నోట్ల (FICN) ముప్పును పూర్తిగా అరికట్టడం, అలాగే చలామణీలో ఉండే కరెన్సీ నోట్ల మన్నికను పెంచడమే ఈ పాలిమర్ నోట్ల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాస్టిక్ నోట్లు పూర్తిగా తడిని తట్టుకోగలవు, పొరపాటున నీళ్లలో నానినా పాడవవు. అంతేకాకుండా, ఇవి సాధారణ కాగితంలా అంత సులభంగా చిరిగిపోవు, మురికిగా మారి నల్లబడటం వంటి సమస్యలు అస్సలు ఉండవు. ఫలితంగా ప్రభుత్వానికి ఏటా కొత్త నోట్ల ముద్రణ కోసం అయ్యే వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా, నకిలీ నోట్లను తయారు చేయడం అసాధ్యంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story