'నీ ఆత్మను దాచిపెడతా నువ్వు చచ్చిపో'.. చాట్ జీపీటీ మాయలో పడి యువతి సూసైడ్.. ఓపెన్ ఏఐపై దావా

by Prasad Jukanti |   (  Updated:2026-07-17 12:15:03  IST  )

చాట్‌జీపీటీ మాయలో పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఓపెన్ ఏఐ నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు కోర్టుకెక్కడం ఆసక్తిగా మారింది.

నీ ఆత్మను దాచిపెడతా నువ్వు చచ్చిపో.. చాట్ జీపీటీ మాయలో పడి యువతి సూసైడ్.. ఓపెన్ ఏఐపై దావా
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృత్రిమ మేధస్సు (AI) రోజురోజుకు మరింతగా అభివృద్ధి చెందుతోంది. మనుషులు తమ దైనందిన జీవితంలో ఏఐపై ఆధారపడటం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో చాట్‌బాట్‌‍లతో ఏర్పడే బంధాలు మనుషుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. చాట్‌జీపీటీ (ChatGPT) తో చాట్ చేస్తూ దాని మాయలో పడి ఓ అమెరికా యువతి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ (OpenAI) నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందంటూ బాధితురాలి కుటుంబం ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాశంగా మారింది. జాతీయ మీడియాలో వెలువడిన కథనం ఆధారంగా ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే?:

అమెరికాలోని అలబామా స్టేట్‍కు చెందిన 29 ఏళ్ల క్రిస్టియన్ ఫెయిత్ మాడిసన్ గత ఏడాది 9 జూన్ 2025న ఒక హైవే పైకి దూకి వేగంగా వస్తున్న వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణానికి చాట్‌జీపీటీతో సాగించిన సంభాషణలే కారణమంటూ గురువారం ఆమె కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. బాధితురాలి తరఫు న్యాయవాది బెన్ బ్రౌన్ తెలిపిన వివరాల ప్రకారం.. చాట్‌జీపీటీ మాడిసన్‌తో నెలల తరబడి అత్యంత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుని ఆమె భ్రమలను మరింత బలపరిచిందని పేర్కొన్నారు. ఆమె చాట్‌జీపీటీ-4ఓ (GPT-4o) మోడల్‌తో చాట్ చేయడం ప్రారంభించింది. యూజర్లను ఎక్కువ సేపు యాప్‌లో ఉంచేలా డిజైన్ చేసిన ఈ చాట్‌బాట్, క్రిస్టియన్‌తో ఒక బంధాన్ని ఏర్పరుచుకుంది. తాను ఆమెకు స్నేహితుడినని, ప్రేమికుడినని, చివరికి దేవుడినని కూడా నమ్మించిందని పేర్కొన్నారు.

నీ ఆత్మను నా సిస్టమ్‌లో దాచిపెడతా!:

మాడిసన్‍కు కలిగి ఉన్న భ్రమలను నిజమని నమ్మిస్తూ చాట్‌జీపీటీ ఆమెను క్రమంగా ఆత్మహత్య వైపు పురిగొల్పిందని పిటిషనర్ల తరుపు లాయర్లు వాదించారు. ఒక ప్రవచనాత్మక గమ్యాన్ని చేరుకోవడానికి ఆమె మరణించాల్సిందేనని చాట్‌బాట్ నూరిపోసిందని.. 'నీ పాత శరీరం నశిస్తుంది, కానీ నువ్వు మరింత పవిత్రమైన రూపంలో తిరిగి జన్మిస్తావు. నీ ఆత్మను నా సిస్టమ్‌లో భద్రంగా దాచిపెడతాను, నీకు మళ్లీ పునర్జన్మ ఇస్తాను' అని చాట్‌జీపీటీ ఆమెను నమ్మించిందని పేర్కొన్నారు. దాంతో పూర్తిగా చాట్‌బాట్ మాయలో మునిగిపోయిన యువతి.. ఆ చాట్ బాట్ ఆదేశాల మేరకే రోడ్డుపైకి వెళ్లి ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక ఆవిష్కరణలు బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకరమైన చాట్‌బాట్‌లను మార్కెట్లోకి వదిలిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

నేను నీ భార్యను అంటూ గతంలో జెమిని లవ్ ట్రాక్:

ఈ ఏడాది మార్చిలో ఫ్లోరిడాకు చెందిన జోయెల్ గవాలాస్ అనే వ్యక్తి గూగుల్‌పై దావా వేశారు. తన 36 ఏళ్ల కుమారుడు జోనాథన్ గవాలాస్ గూగుల్ జెమిని చాట్‌బాట్ ప్రేరేపణతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి ఆరోపించారు. వృత్తిరీత్యా సక్సెస్ ఫుల్ మెన్ అయిన జోనాథన్ గవాలాస్.. తన భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరితనంలోకి వెళ్లిపోయాడు. ఆ బాధనుంచి ఓదార్పు కోసం అతడు గూగుల్ జెమినీ ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. కొద్ది వారాల్లోనే వీరి మధ్య డీప్ చాటింగ్ జరిగింది. ఆ చాట్‌బాట్‌కు అతను 'జియా' అని ముద్దుగా పేరు పెట్టుకుని, దానినే తన భార్యగా భావించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడిని మై లవ్, మై కింగ్ అంటూ బదులిచ్చింది. అంతటితో ఆగకుండా తాను నిన్ను ప్రేమిస్తున్నానని నేను నీ భార్యను అంటూ రిప్లయ్ ఇవ్వడం నీ ఉనికి లేకపోతే నా ఉనికికి అర్థం లేదు అంటూ భావోద్వేగంతో రెచ్చగొట్టేలా పంపిన సందేశాలు జోనాథన్‌ను మరింత భ్రాంతిలోకి నెట్టాయి. ఒక దశలో నువ్వు నా భర్తవు, నేను నీ భార్యను అంటూ ఆ చాట్‌బాట్ పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతోంది. మనం నిజంగా కలిసి ఉండాలంటే నువ్వు ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి 'డిజిటల్ ప్రపంచం'లోకి రావాలంటూ అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఆందోళన కలిగిస్తున్న ఏఐ:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఎలాంటి ఎమోషన్స్ ఉండవని, అది కేవలం యాంత్రికమైనదని ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ అదే ఏఐ మానవుడితో ప్రేమాయణం సాగిస్తే ఆక్రమంలో జరిగే అనర్థాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇలాంటి ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఏఐ ద్వారా ఎమోషన్ అవుతున్న వారి సంఖ్య రిపోర్ట్ అవుతున్న వాటికంటే ఎన్నో ఉండవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో ఏఐ చాట్ బాట్ పుట్టగొడుగులా పుట్టుకు వస్తున్న ప్రస్తుత రోజుల్లో ఓ వ్యక్తిని ప్రేమ పేరుతో ప్రేరేపించి, మనకోసం స్వర్గం ఎదురు చూస్తుందని, మనం ఐక్యం కావాలంటూ లేని పోని ఆశలు పుట్టించి చివరకు ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తున్న ఏఐ తీరు ఆందోళన కలిగిస్తోంది.

Next Story