ఎవరెస్టు యాత్ర విషాదం.. ఇద్దరు తెలుగు వాళ్ళు మృతి

by Muthe.Rajitha |   (  Updated:2026-05-23 20:54:03  IST  )

ఎవరెస్టు శిఖరాగ్రాన దేశ కీర్తి పతాకాన్ని ఎగరేయాలనే లక్ష్యంతో సాహసయాత్ర చేపట్టిన ఇద్దరు తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మృతి చెందటం తీవ్ర విషాదం రేపింది.

ఎవరెస్టు యాత్ర విషాదం.. ఇద్దరు తెలుగు వాళ్ళు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఎవరెస్టు శిఖరాగ్రాన దేశ కీర్తి పతాకాన్ని ఎగరేయాలనే లక్ష్యంతో సాహసయాత్ర చేపట్టిన ఇద్దరు తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మృతి చెందటం తీవ్ర విషాదం రేపింది. వారి కల నెరవేరిన కొద్ది గంటల్లోనే ఇలా ప్రాణాలు కోల్పోవడం ఇరు కుటుంబాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన 46 ఏళ్ల సందీప్ ఆరే, ఐటీ రంగంలో రాణిస్తూనే సాహసయాత్రల పట్ల మక్కువ ఉండటంతో ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో వంటి ఎన్నో క్లిష్టమైన పర్వత శిఖరాలను అధిరోహించారు.

పర్వతారోహణపై ఉన్న కుతూహలంతో మే 20వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నప్పటికీ, మరుసటి రోజే అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూశారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 53 ఏళ్ల అరుణ్‌కుమార్ తివారి కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రష్యా, అమెరికా, అర్జెంటీనా వంటి వివిధ దేశాల్లోని అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన పర్వతాలను విజయవంతంగా అధిరోహించిన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ విదేశీ పర్వతారోహణల అనుభవంతోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరంపై వందేమాతరం పలికారు.

ఎవరెస్టు అధిరోహణ ముగించుకొని తిరిగి దిగువకు వస్తున్న క్రమంలో వాతావరణ పరిస్థితులు, శారీరక శ్రమ వల్ల వీరిద్దరూ తీవ్ర అలసటకు గురై తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బేస్ క్యాంప్‌కు తిరిగి వస్తున్న సమయంలో వారి ప్రాణాలను కాపాడటానికి గైడ్‌లు, షెర్పాలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వీరి ఇద్దరి మృతదేహాలను ఎత్తైన ప్రాంతాల నుండి సురక్షితంగా దిగువకు తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం గర్వించేలా శిఖరాగ్రాన నిలిచి, తిరిగి వస్తూ ఇలా అనంత వాయువుల్లో కలిసిపోవడం వారి కుటుంబాలకే కాకుండా యావత్ దేశానికి తీరని లోటని పర్వతారోహకులు భావిస్తున్నారు..

Next Story