ధాన్యం డబ్బులు ఎక్కడ ?

by Batti.Sumithra |

ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యానికి నెలలు గడిచినా డబ్బులు అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు సోమవారం రోడ్డెక్కారు.

ధాన్యం డబ్బులు ఎక్కడ ?
X

దిశ, ఖానాపూర్ : ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యానికి నెలలు గడిచినా డబ్బులు అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు సోమవారం రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేశారు. అయితే ధాన్యం అప్పగించి నెలలు గడిచినా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా "చలో కలెక్టర్ ముట్టడి" అంటూ నినాదాలు చేస్తూ మస్కాపూర్ సమీపంలోని మెటపల్లి ప్రధాన రహదారి పై రైతులు బైఠాయించి రెండు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు.

దీంతో ఆ మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు మాట్లాడుతూ ఐకేపీ సిబ్బంది రవాణా లారీ డ్రైవర్లకు ఒక్కో బస్తాకు రూ.3 చెల్లించాలని తమ వద్ద నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, రైస్ మిల్లర్లు క్వింటాలుకు 10 నుంచి 15 కిలోల వరకు అనధికారిక కోత విధిస్తున్నారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎస్సై రాహుల్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అయితే, ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే వరకు రాస్తారోకో విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. చివరకు మూడు రోజుల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సుజాత రెడ్డి, ఏపీఎం మల్లేష్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు ఉపసర్పంచ్ దోనికేని వెంకటేష్, మాజీ సర్పంచ్ అడిదెల మహేందర్, పుప్పాల ఉపేందర్, అడిదెల మహిపాల్, గజేందర్ తదితరులు సంఘీభావం తెలిపారు.

Next Story