అగ్రికల్చర్ వర్సిటీ ప్రశ్నపత్రాల లీకేజీలో ట్విస్ట్.. సీన్‌లోకి ఆ కళాశాల సిబ్బంది

by Kema Shiva Kumar |

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది.

అగ్రికల్చర్ వర్సిటీ ప్రశ్నపత్రాల లీకేజీలో ట్విస్ట్.. సీన్‌లోకి ఆ కళాశాల సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఈ ఉదంతంపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా, ఈ కుంభకోణంలో వరంగల్ వ్యవసాయ కళాశాల సిబ్బంది హస్తం ఉన్నట్లు తేలడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. విశ్వవిద్యాలయ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌ను (JTA) తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ విచారణ

కాగా, పేపర్ లీక్ మూలాలను వెలికితీసేందుకు వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వరంగల్ సహా పలు జిల్లాల్లోని వ్యవసాయ కళాశాలల్లో రహస్య విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బందితో చేతులు కలిపి భారీగా నగదు వసూలు చేసి పేపర్లను లీక్ చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ అక్రమాలు నిశ్శబ్దంగా కొనసాగుతున్నాయనే ఉదంతం బయటపడింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమిటీ పరిశీలిస్తోంది. ఇప్పటికే సస్పెండ్ అయిన సిబ్బంది, విద్యార్థుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అనుమానిత కళాశాలల్లోని రికార్డులను కమిటీ సభ్యులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Next Story