- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరి ఇల్లు ఇరవై ఏళ్ల ప్రస్థానం - డా. సూర్యప్రకాష్ వింజమూరి
ఇల్లొక రాజకీయం అన్నారు ఇటీవల ఒక రచయిత్రి. ఇల్లొక ఆధిపత్యాల కేంద్రమైనప్పుడు, ఇల్లొక హింసకు నెలవైనప్పుడు, ఇల్లొక హోదాకి చిహ్నమైనప్పుడు, ఇల్లు కేవలం ఒకరి ఆస్తి అయినప్పుడు ఆమె అన్నమాట నిజమే.

అందరి ఇల్లు ఇరవై ఏళ్ల ప్రస్థానం - డా. సూర్యప్రకాష్ వింజమూరి
(నా పనే నా ఆలోచన నా పనే నా మాట)
ఇల్లొక రాజకీయం అన్నారు ఇటీవల ఒక రచయిత్రి. ఇల్లొక ఆధిపత్యాల కేంద్రమైనప్పుడు, ఇల్లొక హింసకు నెలవైనప్పుడు, ఇల్లొక హోదాకి చిహ్నమైనప్పుడు, ఇల్లు కేవలం ఒకరి ఆస్తి అయినప్పుడు ఆమె అన్నమాట నిజమే. కానీ ఇల్లు అందరిదీ అయినప్పుడు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అవుతుంది. ఇలపై అదొక స్వర్గం అవుతుంది. ఆనంద నిలయమౌతుంది. వేసవిలో చలివేంద్రమౌతుంది. ఆకలి తీర్చే అమ్మ చేతిముద్ద అవుతుంది.
అటువంటి ‘అందరి ఇల్లు’ అనే స్వచ్ఛంద సంస్థ పెట్టాలనే ఆలోచనకు బీజం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో పడింది. థాయిలాండ్ లో జరిగిన గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ మార్జినలైజ్డ్ అన్న సదస్సులో ఒక విదేశీయుడు మన భారతీయ బృందం వద్దకు వచ్చి ‘మీ భారతీయులకు ఆహారం పంచుకోవడం తెలియదు’ అని విమర్శించాడు.
అతని ఆ మాట నుంచి పుట్టినవే అందరి ఇల్లు, అందరి పుస్తకం, అందరి శ్వాస, అందరూ బాగుండాలి అనే కార్యక్రమాలు. జయధీర్ తిరుమలరావు హి ఈస్ ద పర్సన్ బిహైండ్ దీస్ నేమ్స్. నా సంస్థ పేర్లన్నీ ఇంగ్లీషులో ఉండేవి, నేను ఇంగ్లీషు మీడియంలో చదువుకోవడం వల్ల. అలా అని ఇంగ్లీషులో ఎక్స్పర్ట్ అని కాదు. లైఫ్ హెల్త్ రీ ఇన్ఫోర్స్మెంట్ మెంట్ గ్రూప్, స్ప్రడింగ్ లైట్, ఓపెన్ హౌస్ ఇలా ఉంటే ఆయన సంస్థ పేరు మార్చెయ్యి, తెలుగులో రాయి అన్నది ఆయనే. అయితే సంస్థ పేరు మార్చడం సంభవం కాదు కనుక ప్రోగ్రామ్స్ పేర్లు మారుద్దామని అనుకుని అప్పుడే ‘అందరూ’ అన్నపదం ఆ భావం వచ్చేటట్లు పెట్టుకున్నాం.
నేను ఎక్కువగా చదువుకోలేదు. అధ్యయనం కంటే ఆచరణ గొప్పది అని నమ్ముతాను. ‘నా పనే నా ఆలోచన నా పనే నా మాట’ కావాలని ఆకాంక్షిస్తాను. చాలా జీవితాలని చూసాను. చిన్నప్పటినుంచి కుటుంబంలో అక్క అనారోగ్యంతో ఉండేది, ఉన్న ఆరుగురిలో ఒకరికి పుట్టుకతోనే ఆనారోగ్యం ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది? నాన్నగారు ఇంటి పెద్ద అయితే పిల్లల పట్ల ఆయన శ్రద్ధ ఎలా ఉంటుంది? డబ్బు అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? ఇవేవీ తెలియకుండానే పెరిగాను. నాన్నగారు ఒక సీనియర్ అడ్వకేట్. ఆయనకి అన్ని యూనియన్స్ తో సంబంధాలు ఉండేవి, ఎక్కువగా SBI ఆల్ ఇండియ బాకింగ్ అసోసియేషన్ తో సన్నిహితంగా ఉండేవారు. నా వయస్సు నాలుగేళ్ళప్పటినుంచి యూనియన్ లో కామ్రేడ్ అనే పిలుపు విన్నాను. వాళ్ళు నన్ను భుజాలపై ఎక్కించుకుని తిరుగుతున్నప్పుడు ఇవన్నీ తెలిసేవి కాదు. అప్పుడు మనుషులు కలిసి ఉండటాన్ని మేం సంపూర్ణంగా చూసాం. అనుభవించాం. అదృష్టవశాత్తు ఎక్కువ చదువుకోకపోవడం మూలాన నాకు కులం గురించి మతం గురించి తెలియదు. ఏ ఇబ్బందులు తెలీయకపోవడం, నాన్నగారు ఆర్థికంగా స్థితిమంతులవవ్వడంతో ఆకలి అన్నది పరిచయం కాకపోవడం వల్ల థాయిలాండ్ లో ‘you Indians, you do not know how to organise food for your people’, అన్న ఒక మాట విన్నప్పుడు నాలో పెద్ద కుదుపు కలిగింది.
భారతదేశం మీద మక్కువ ఉండి అప్పటికే ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ, దేశం కోసం ఎన్నో ఆలోచనలలో ఉన్న నాకు ఒక విదేశీయుడు అన్నమాట అస్సలు నచ్చలేదు. అక్కడ ఉండగానే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ ఆహారం ఏమిటి? ఈ ఆకలి సమస్య ఏమిటి? దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుని, భారతదేశం తిరిగి వచ్చాక కాథలిక్ హెల్త్ ఎసోసియేషన్ ఆఫ్ ఇండియాలో అప్పటికే మూడు సంవత్సరాలనుంచి పనిచేస్తున్న నేను, ఆ సంస్థ యాజమాన్యంతో నాకు ఆహారం మీద పనిచెయ్యాలని ఉందని చెప్పాను. వాళ్ళు మాకు కొద్ది సమయం ఇవ్వమని అడిగారు. ‘కానీ ఈ పని నాకు తక్షణమే చెయ్యాలని ఉంది, ఒకవేళ మీరు నాకు ఈ పని చేసే అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాన’ని అన్నాను.
నాకు నచ్చిన అంశంపై పనిచేయడానికి వారు తగిన సమయంలో తమ నిర్ణయం చెపుతానన్నారు. కానీ ఐదు నెలలు గడిచాయి. ఏ నిర్ణయం తీసుకోలేదు. 1999 జూన్ ఒకటిన రాజీనామా చేసి ఆహారం మీద పనిచెయ్యాలనే దృఢ సంకల్పంతో లైఫ్ – హెల్త్ రీ ఇన్ఫోర్సుమెంట్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. అయితే మొట్టమొదటి కార్యక్రమం కింద, బడి పిల్లలలో ఆహారం పోషకం గురించి తెలుసుకోవడానికి రంగారెడ్డి జిల్లాలో ఉన్న నూటయాభై ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలందరూ పాల్గొనేటట్లు అక్టోబర్ నెలలో, ఆహారం మీద పని చేస్తున్న వివిధ సంస్థలతో కలిసి ఆహారం పరిశుభ్రత మీద మూడు రోజుల పాటు ప్రదర్శనను ఏర్పాటుచేసాం. ఆ ప్రదర్శనలో National Egg Coordination committee వారు పదివేల గుడ్లను ఇచ్చారు. మా దగ్గర తగిన వనరులు లేకపోవడం వల్ల పిల్లలకు ఉడకపెట్టిన గుడ్లనే ఆహారంగా ఇవ్వడం పిల్లలు ఆ గుడ్లను ఆత్రంగా కుక్కుకొని తినడం చూసి కళ్ళు చెమర్చి నా భార్యను ప్రక్కకు పిలిచి ఈ పిల్లలకు ఇంకా చక్కటి ఆహారం అందజేయలేమా అని బాధ పడ్డాను. అప్పుడే ఆహారం పంచుకోవాలనే బీజం పడింది.
ఈ ప్రదర్శన అయ్యిందో లేదో సూపర్ సైక్లోన్ ఒరిస్సా రాష్ట్రానికి తాకిందని అక్కడవారికి ఆరోగ్యసేవలు అందజేయడానికి స్వచ్ఛందంగా పాలుపంచుకోమన్న ఒక స్వచ్ఛంద సంస్థ పిలుపుతో నవంబర్ లో ఒక పది రోజుల పాటు ఆ పెనుతుఫాన్ చేసిన బీభత్సంలో అక్కడ చేసే రిలీఫ్ వర్క్ లో భాగంగా ఎన్నో చూడకూడని దృశ్యాలు చూశాను. చనిపోయిన వారు చనిపోగా, చనిపోకుండా బ్రతికి ఉన్న వారు ఆహారం అందక పడుతున్న ఇబ్బందులు, ఇళ్ళు, నివసిస్తున్న ఆవాసాలు దెబ్బతిని అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు ఇంకా ఎన్నో పంచుకోలేని మనస్సును తాకీ ఈ రోజుకు మనస్సును ఇబ్బందిపెట్టే అనేక అంశాలు, వీటన్నింటీకీ నేను ప్రత్యక్ష సాక్షిని. జీవితంలో ఏ మనిషీ చూడకూడని అనుభవించకూడని జీవిత ఘట్టాలవి. విపత్తుల్లో ఆహార కొరత మాత్రమే కాదు, ఏ విపత్తులు లేని చోట కూడా పిల్లలకు ఆహార కొరత ఉన్నదని తెలియడం, సరైన ఆహారం దొరకక వాళ్ళు అనుభవించే కష్టాలు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి
దానికి తోడు నా జీవితంలో నేను, నా పశ్న - ఏ ప్రశ్న వేటాడుతూ ఉందో ఏ దృశ్యాలు వెంటాడుతూ ఉన్నాయో ఆ దృశ్యాలే వాస్తవంగా కళ్ళముందు ప్రత్యక్షం అవ్వడంతో పౌరుల ఆహార భద్రత గురించిన నా ఆలోచనలపై ప్రభావం వేశాయి
అలాంటి సంఘటనలు:
1) నేను ట్రైన్ ఎక్కే సమయం లో ఒక అతను తాను తింటున్న ఐస్ క్రీం సగం తిని మిగతాది చెత్తబుట్ట వైపు విసరడం, ఎంత వేగంగా విసిరాడో అంతే వేగంగా చురుకుగా ఫ్లాట్ ఫాం మీద ఉన్న అబ్బాయి ఆ ఐస్ క్రీంను పట్టుకుని మింగేయడం
2) రోడ్డు మీద ఇద్దరు స్కూల్ పిల్లలు ఆరు -ఎనిమిది సంవత్సరాల వయస్సు వాళ్లు ఒక విస్తరాకు మీద అనేక ఆహారపదార్థాలు వడ్డించి ఉన్న ఎడ్వర్టైజ్మెంట్ పోస్టర్ ను చూస్తూ ఒక్కొక్కటీ తింటున్నట్టు ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నట్టు చేసున్న దృశ్యం
3) సికింద్రాబాద్ లో పొద్దున్న ఏడు గంటల సమయం ఒక చెత్త కుడీ దగ్గర చుట్టురా పిల్లలు కూర్చుని చెత్తకుండీలో ఉన్న ఆహారాన్ని తీసుకుని వడ్డించుకుని తినడం.
ఇలాంటి దృశ్యాలు, విపత్తులలో చూసిన దృశ్యాలు, చుట్టుపక్కల గ్రామాలలో వైద్యం చేస్తున్నప్పుడు చూసిన ఆహార కొరత ఇవన్నీ కొట్టొచ్చినట్లు కనిపించడం నన్ను కదిల్చివేసాయి. ఎట్లాగ? ఎట్లాగ చెయాలి? ఎలా ఆహారం అందజేయాలి? నేను ఆహారం తింటున్నప్పుడు సాటివాడు తింటున్నాడో తినడం లేదో అన్న బాధ కలగడంతో దీనికి పరిష్కారం ఏమిటి అన్న ఆలోచన నుంచి వచ్చిందే ‘బనానా హెల్త్ పాయింట్’. దీని ముఖ్య ఉద్దేశం ఒకరు తింటూ మరొకరికి ఆహారం అందజేయడం. తద్వారా ఆకలి సమస్యను కొంతవరకు పరిష్కరించడం. ఇది రోజువారీ చెయ్యవచ్చని నమ్మకంతో 2001 వ సంవత్సరం నవంబర్ నెలలో ‘అరటిపండు తోపుడు బండి’ మొదలు పెట్టడం జరిగింది.
ఎన్నో చక్కటి అనుభూతులు ఎన్నో విలువైన అనుభవాలు ఆ బండి ద్వారా కలిగాయి. రోజువారి అరటిపండు పంచుకోవడం చూసినప్పుడు ఇలా రోజువారి ఆహారం పంచుకోవడం అన్నది సాధ్యమే అన్న నమ్మకం కుదిరింది. ఒక్క బండితో మొదలైన ఆ కార్యక్రమం తొమ్మిది బండ్లుగా ఎదిగింది. అయితే ఆర్థికంగా వాటిని నిర్వహించడంలో విఫలం అయ్యాము. తరచుగా మాకు వచ్చిన ప్రశ్న.. రోజూ అరటి పండేనా? ఆ ప్రశ్నకు నాకు వచ్చిన సమాధానం. ఇది ఒక్కరితో జరగదు. అందరూ ఆహారం పంచుకుంటే గానీ ఈ ఆహారసమస్య తీరదు అనే నమ్మకం తో ఏంచేయాలా ఏంచేయాలా? అన్న ఆలోచన చేస్తూనే, ఈ మా ఆహారం పంచుకున్న అనుభవాలను అందరికీ చెపుతూ పోయాం.
ఒక సందర్భం లో ఒక వయోలిన్ విద్వాంసురాలు నువ్వు చెపుతున్నది తైత్తరీయ ఉపనిషత్ లో ఉన్నదని చెప్పి వెంటనే వయోలిన్ తీసుకుని వాయించడం మొదలుపెట్టారు. అలా ఆ ఉపనిషత్ లో ఆహారాన్ని ఎలా పంచుకోవాలో చెప్పిన పలు విషయాలను నృత్యరూపకంగా ప్రజలకు సందేశం ఇవ్వాలని సంకల్పించాం, ముప్పై రెండు మంది కూచిపూడి కళాకారిణులతో డిసెంబర్ పదిహేను రెండువేల నాల్గవ సంవత్సరం రవీంద్రభారతిలో ఆ ప్రోగ్రాం జరిపినప్పుడు హాల్ అంతా నిండింది. అలా నిండిపోవడంతో నేను మెట్ల మీద కూర్చుని ఉంటే నా భార్య కామేశ్వరి వచ్చి ఇంత మంది వచ్చారు, విజయవంతం అయ్యింది కదా, ఈ ప్రోగ్రాం మీరు అనుకున్నట్లు అయ్యింది కదా అంటే , లేదు వచ్చినవాళ్లకు ఇది మనం ఎందుకు చేస్తున్నామో అర్థం అయినట్లు లేదు. ఈ సమస్యకు మళ్ళీ మనం సమాధానం వెదకాల్సిందే! అని నేను అన్నాను. ఇలా మొత్తం ప్రయాణంలో ఆహారం పంచుకోవడం ఎలా చెయ్యాలన్న ప్రశ్న వేధించడం మానలేదు. దానికి సమాధానంగా డిసెంబర్ ఒకటి రెండువేల ఐదు సంవత్సరంలో ఈ అందరి ఇల్లు ఆలోచన రావడం, ఈ విషయాన్ని స్వచ్ఛంద సంస్థలోని కొందరు మిత్రులతో పంచుకోవడం, వారు నన్ను అప్పుల్లో పడిపోతావ్, చాలా కష్టపడతావ్, ఇబ్బందుల్లో పడిపోతావ్, ఇది జరగదు, ఇది అవ్వదు అని చెప్పి వారించారు.
కాని నామనస్సుకు ఇది జరుగుతుంది, అవుతుంది, కుదురుతుంది అన్న గట్టినమ్మకం ఉంది. జనవరి ఇరవై మూడు రెండువేల ఆరవ సంవత్సరం ప్రారంభించాలని అనుకుని అందరికీ చెప్పాను. వచ్చినవారందరికీ రాత్రి పదకొండు నుంచి ఒంటిగంట వరకు ఆహారం పంచుకుంటానని కొత్తపేట్ రైతుబజార్ వెనుక ఉన్న అద్దెఇంట్లో మొదలు పెడతానని ప్రకటించాను. దురదృష్టవశాత్తు జనవరి ఇరవైన మా అన్నగారు కాలం చెయ్యడంతో ఆ ఆలోచన తాత్కాలికంగా నిలిచిపోయింది,
నాన్నగారికి కుడి భుజం అయిన అన్న చనిపోవడంతో ఇంట్లో వాతావరణం శోకసముద్రంలా ఉండడంతో కొన్ని నెలల పాటు నాన్నగారిని అంటిపెట్టుకుని ఉండి, ఇంకేం పని పెట్టుకోలేదు. అప్పుడు ఏప్రిల్ నెలలో నేను బాల్కనీలో కూర్చుని ఉండగా ఎంత కాలం ఏం చెయ్యకుండా ఉంటావు? నీ పని నువ్వు చూసుకో అని నాన్నగారు చెప్పడంతో మళ్ళీ మే పద్దెనిమిదిన ‘అందరి ఇల్లు’ అనే ఆలోచనను అమలు చెయ్యాలన్న నిశ్చయం చేసుకుని ఆ దిశగా పనులు ప్రారంభించాను. మరోసారి దురదృష్టం కాటేసింది. మే పదిహేనున నాన్నగారు మాసివ్ హార్ట్ ఏటాక్ తో కాలం చేశారు. అయితే ఆ రోజునే జూన్ పదిహేనున ‘అందరి ఇల్లు’ పారంభిస్తానని అనడంతో నీకు పిచ్చెక్కింది, నాన్న, అన్న చనిపోయారు ఇంకా ఏంటి ఈ ఆలోచన అని అందరూ అన్నారు. అయితే నా సమాధానం వాళ్ళు బ్రతికి ఉంటే ఏమైనా చెయ్యగలం కానీ చనిపోతే ఏం చెయ్యగలం ఏడుస్తూ కూర్చోకుండా మనం నమ్మిన పనిని మనం చెసుకోవాలి కదా మన పనే మన శ్వాస. నేను నమ్మింది ఆకలి వేస్తే అందరికీ గుప్పెడు అన్నం వేడిగా దొరకాలని.
ఏంటి ఆకలితో ఇంకా ఉన్నారా అనే ప్రయత్నంలో మొదట అరటి పండ్ల బండి ద్వారా, రెండోసారి తైత్తరీయ ఉపనిషద్ డాన్స్ బ్యాలే ద్వారా, మూడవది ‘అందరి ఇల్లు’ అనే ఆలోచనతో, భావంతో ముందుకు వచ్చాము. ఇది మా ప్రాణం, ఇది మా ఆలోచన, మా సమాధానం. సమాజంలో జీవించే పద్ధతి ఏంటి? కూడబెట్టు కోవడమా పంచుకోవడమా? కూడబెట్టు కోవడంలో సమయం పోతుంది. ఎంత తెలివైన వాళ్లైనా కూడబెట్టుకోవడం రేపొద్దున ఎలా ఉంటుంది జీవితం అనే భయంతోనే జరుగుతుంది.
అందుకే మొదట చేసింది నేను నా భార్య మా పేరు మీద ఉన్నది ప్రతీదీ సమాజానికి ఇచ్చేసాం. మొదట ఎంట్రీలోనే మాకంటూ సొంతంగా ఏమీ ఉండకూడదు అని అనుకున్నాం. ఆ ఫ్లాట్ కావాలి, ఈ ఫ్లాట్ కావాలి ఆ ఆస్తి కావాలి అంటే అన్నీ తీసుకోండి అని చెప్పాం. ఎప్పుడైతే ఉండదో అప్పుడు చేయగలగడం తేలిక అవుతుంది. ఉంటే ఏమిటౌతుందంటే ఆ కఫర్ట్ జోన్ లోకి వెళ్ళి పోతాం. ఇవ్వాల్టికి కూడా మేం అద్దె ఇంట్లోనే ఉంటాం. చాలా నేర్చుకుంటున్నాం. నా కుటుంబానికి, సమాజానికి నేను ఇవ్వగల సమాధానం ఇది. నా మనస్సే నా ఆలోచన నా పనే నా మాట. మనిషిని మనిషిగా గుర్తించే వ్యవస్థే మా ‘అందరి ఇల్లు’.
ఆకలిని చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. చాలా తక్కువ మందికి తెలుసని నా ఉద్దేశం ఇప్పటికి కూడా. ఆకలి గురించి అర్థం చేసుకోవాలంటే ఓపెన్ హౌస్ లో ఉండాలి, చూడాలి, కలిసి ఉండాలి. అన్నం పంచుకోవడం అన్నది ఫలానా రోజుననే కాకుండా ప్రతి రోజూ, ఎలాగైతే మనం ప్రతిరోజూ ఆహారం సమకూర్చుకుంటున్నామో అలాగే అందరికీ, అది అందరికీ అవసరమే కదా, దొరకాలి. మేము సంస్థ కాబట్టి రోజుకు వంద మందికి చేరువ కాగల్గుతున్నాం. మాకు మూడు యూనిట్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఒకటి శివరాం పల్లిలో ఉంది. అలానే చింతల్ లో ఉంది. మాక్సిమం ఎక్కువగా వాడబడేది కొత్తపేట్ లోని అందరి ఇల్లు . చింతల్ లో పుస్తకప్రియులు రచయితలు వచ్చి అక్కడ ఉండవచ్చు. పద్దెనిమిది వేల పుస్తకాలున్నాయి. ఉండడానికి వసతి ఉంది. తినడానికి కిచెన్ ఉంది. ఎప్పుడైనా మంచి పుస్తకం రాయాలన్నా బేషరతుగా వచ్చి వాడుకోండి. చెప్పి చెప్పి అలసిపోతున్నాను. నేను చెప్పడం ఇన్వైట్ చేయడమేమిటి అందరిదీ అన్నప్పుడు? నాకు తెలియదు. ఎవరి లెక్కలు వాళ్ళకి, లెక్కలేమైనా ఉంటే అవన్నీ బాస్కెట్ లో పడేయండి. పడేసెసి రండి, అర్థం చేసుకోండి, పూచీ పడండి మనందరం మనుషులమని మనస్సున్నదని.
ఎవరైతే అందరి ఇల్లు విజిట్ చేయలేదో వారికి మా రిక్వెస్ట్. రండి. మాతో పాటు ఒక్కరోజు ఉండండి. వచ్చి చూసి వెళ్ళిపోవడం కాదు. ఉండాలి. ఉండాలక్కడ. ఒక్క కూర లేకపోతే ఒక్క పచ్చడి లేకపోతే ఒక్క పప్పు తింటారండీ. కానీ ఎంత సంబరంగా ఉంటుందో! ప్రతి మీల్ ఎవ్రీడే సెలబ్రేషనే. మీకు దీపావళి, క్రిస్మస్, రంజాన్ అని అనుకుంటారు కదా మాకు రోజూ అలా ఉంటుంది. ఇక్కడ ఎక్కువమంది తెలుసున్నవాళ్ళే. మాతో పాటు నడుస్తున్నవాళ్లు. మా గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ ఇరవై ఆరు సంవత్సరాలై పోయింది సంస్థ పెట్టి. అందరి ఇల్లు (ఓపెన్ హౌస్) పెట్టి ఈ జూన్ పదిహేనుకు ఇరవై ఏళ్ళు అవుతుంది. ఒక బానర్ లేకుండా, ఏ నినాదాలు లేకుండా ఇవాళ రోజుకు వందమందికి పైగా వస్తున్నారు. అందరూ ఇది నాది అని అనుకోవడం అలవాటవ్వాలి. నాదని నేను ఎప్పుడూ అనలేడు. ఇది అందరిదీ. మనందరిదీ.
డా. సూర్యప్రకాష్ వింజమూరి
అందరి ఇల్లు
10-16 రోడ్డు నెంబర్ -2, ఎస్. బి. ఐ కాలనీ, కొత్తపేట్, హైదరాబాద్ -500035
ఈ మెయిల్ - [email protected]. Cell number- 9849020242
- Tags
- telugu sahityam






