భారతీయులను చంపుతుంటే థాంక్యూ చెప్తారా? ప్ర‌ధాని మోడీపై కేజ్రీవాల్ ఫైర్‌!

by Thanuru Gopichand |

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఆయన ఘాటైన విమర్శలు గుప్పించారు. దేశ పౌరుల ప్రాణాలను ప్రధాని మోడీ ట్రంప్‌కు పూర్తిగా లొంగిపోయేలా చేశారని ఆరోపించారు.

భారతీయులను చంపుతుంటే థాంక్యూ చెప్తారా? ప్ర‌ధాని మోడీపై కేజ్రీవాల్ ఫైర్‌!
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: భారతీయ సిబ్బంది లక్ష్యంగా అమెరికా సైన్యం జరిపిన దాడులు, ముగ్గురు భారత పౌరుల మృతికి సంబంధించిన ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ గురువారం ఆయన ఘాటైన విమర్శలు గుప్పించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, దేశ పౌరుల ప్రాణాలను ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తిగా లొంగిపోయేలా చేశారని ఆరోపించారు.

దేనికి థాంక్యూ మోడీ జీ..?

భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభుత్వాధినేతగా నిలిచినందుకు అభినందనలు తెలిపిన ట్రంప్‌కు ధన్యవాదాలు చెబుతూ ప్రధాని మోడీ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయ నావికులు ఉన్న నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోడీ ట్రంప్‌కు 'థాంక్యూ' చెబుతున్నారు.. అసలు దేనికి థాంక్యూ చెప్తున్నారు? భారతీయులు ఉన్న నౌకలపై దాడులు చేసి, మన పౌరులను చంపినందుకా? ప్రస్తుత పరిస్థితి మన దేశానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

బలమైన ప్రధాని కావాలి..

దేశ గౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో కేంద్రం విఫలమైందని కేజ్రీవాల్ విమర్శించారు. భారతదేశానికి ఇప్పుడు ఒక బలమైన ప్రధానమంత్రి అవసరం. మన దేశంతో, మన ప్రజల ప్రాణాలతో ట్రంప్ తనకు నచ్చినట్లు ఆడుకోవడానికి ఎంతమాత్రం అనుమతించకూడదు అని ఢిల్లీ మాజీ సీఎం స్పష్టం చేశారు.

మూడు నౌకలపై దాడులు: విదేశాంగ శాఖ

మరోవైపు గడిచిన నాలుగు రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు మర్చంట్ నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసిందని, ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ పౌరులు మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరించింది. ఈ దాడుల అంశాన్ని తాము వాషింగ్టన్‌ (అమెరికా ప్రభుత్వం) దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

Next Story