- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనియా గాంధీ ఓటరు నమోదు వివాదంలో కీలక మలుపు
భారత పౌరసత్వం రాకుండానే ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకున్నారనే ఆరోపణలతో సోనియా గాంధీ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారత పౌరసత్వం రాకుండానే ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకున్నారనే ఆరోపణలతో సోనియా గాంధీ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పౌరసత్వం, ఓటరు జాబితాలో పేరు నమోదుకు సంబంధించిన వివాదం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కీలక దశకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. సోనియా గాంధీకి 1983లో భారత పౌరసత్వం లభించగా, అంతకంటే మూడేళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరును న్యూఢిల్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలో అక్రమంగా చేర్చారని వికాస్ త్రిపాఠి అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. ఇది ఫోర్జరీ, మోసం, ఎన్నికల చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని, దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అయితే, గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన మెజిస్ట్రేట్ కోర్టు, తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ దీనిని కొట్టివేసింది.
దీంతో అతను మెజిస్ట్రేట్ కోర్టు నిర్ణయం పై అసంతృప్తి చెందడంతో పాటు.. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. దీనిపై స్పందించాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్‌లో సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సోనియా గాంధీ తరపు న్యాయవాదులు శనివారం కోర్టులో తమ వివరణాత్మక సమాధానాన్ని (Reply) దాఖలు చేశారు. గత విచారణ సమయంలో సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కోరగా, తాజాగా వారు సమర్పించిన అఫిడవిట్‌ను కోర్టు రికార్డుల్లోకి తీసుకుంది. ఈ పరిణామంతో కేసు విచారణలో కీలక పురోగతి లభించినట్లయింది.
ఇదిలా ఉంటే ఈ కేసును శనివారం (ఫిబ్రవరి 7న) విచారించాల్సి ఉండగా, తదుపరి సమగ్ర విచారణను కోర్టు ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియలో జరిగినట్లుగా చెబుతున్న లోపాలు (Lapses), పౌరసత్వ నిబంధనల ఉల్లంఘనపై ఆ రోజున కోర్టు సుదీర్ఘంగా వాదనలు విననుంది. పౌరసత్వం రాకముందే ఓటరుగా ఎలా నమోదయ్యారనే అంశంపై పిటిషనర్ తన వాదనలను బలంగా వినిపిస్తుండగా, సోనియా గాంధీ తరపు న్యాయవాదులు ఈ ఆరోపణలను ఎలా తిప్పికొడతారనేది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






