సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌లో ముసలం..!

by Jakkula.Mamatha |

సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్‌లో నెలకొన్న అంతర్గత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌లో ముసలం..!
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్‌లో నెలకొన్న అంతర్గత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల జరగాల్సిన సాధారణ సమావేశం వాయిదా పడిన తర్వాత మున్సిపల్ పాలన, కౌన్సిలర్ల మధ్య సమీకరణలు, అసంతృప్తి వర్గం కదలికలపై విస్తృత చర్చ కొనసాగుతోంది. నేడు జరగనున్న సాధారణ సమావేశం సజావుగా సాగుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవల నిర్వహించాల్సిన సాధారణ సమావేశం చైర్‌పర్సన్ అనారోగ్యంతో వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, అంతకు ముందు పలువురు కౌన్సిలర్లు గైర్హాజరు కావడం, కోరం అంశం కూడా చర్చకు దారితీసింది. దీంతో సమావేశం వాయిదా వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా బీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలతో సిరిసిల్లలో రాజకీయం మరింత వేడెక్కుతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అసంతృప్తి వర్గం కదలికలు..

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలకు మించి సాధించి సిరిసిల్ల బల్దియా పై బీఆర్ఎస్ జెండా ఎగరవేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం కొలువుతీరి పట్టుమని పది నెలలు కాకుండానే ముసలం మొదలైంది. చైర్ పర్సన్ భర్తను టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఇతర కుంపటి పెట్టినట్లు కౌన్సిల్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండోసారి జిందం కళను ఎన్నుకోవడం ముందు నుంచే కొందరు కొంత మంది కౌన్సిలర్లు వ్యతిరేకించినట్లు విమర్శలు వినిపించాయి. దీంతో అసమ్మతి వర్గం రోజుకో సమావేశం, వారానికో విందు అంటూ వరుస చర్చలతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాలు మున్సిపల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయా అనే ఆసక్తి నెలకొంది.

పెండింగ్‌లో కీలక తీర్మానాలు..

గత మే నెలలో జరగాల్సిన సాధారణ సమావేశానికి మెజారిటీ కౌన్సిలర్లు హాజరు కాకూడదని ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ ఒక కౌన్సిలర్ అకాల మరణంతో సమావేశం వాయిదా పడింది. జూన్ రెండో వారంలో జరగాల్సిన సాధారణ సమావేశం కూడా మెజారిటీ కౌన్సిల్ సభ్యులు హాజరు కాకపోవడంతో చైర్ పర్సన్ అనారోగ్యం పేరిట సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. సాధారణ సమావేశం వాయిదా పడటంతో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల ఆమోదం, నిధుల వినియోగం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాలు తదితర అంశాలపై నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయమేనా.. లేక పరిపాలనా సమస్యేనా..?

ఒకవైపు అధికార పక్షం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు అసంతృప్తి వర్గం తమ బలాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉందనే ప్రచారం కొనసాగుతోంది. మున్సిపల్ కౌన్సిల్‌లో నెలకొన్న విభేదాలు రాజకీయ పరిమితుల్లోనే ముగుస్తాయా? లేక పాలన పై ప్రభావం చూపుతాయా? అనే చర్చ కొనసాగుతోంది. ప్రజల దృష్టి నేడు జరగనున్న సాధారణ సమావేశానికి అన్ని వర్గాల కౌన్సిలర్లు హాజరవుతారా? పెండింగ్‌లో ఉన్న తీర్మానాలు ఆమోదం పొందుతాయా? అంతర్గత విభేదాలకు తెరపడుతుందా? లేక మరోసారి రాజకీయ వేడి రాజుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ సమావేశాలు సజావుగా సాగాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు. నేటి సమావేశం సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాలకు కీలక మలుపు అవుతుందా? లేక అంతర్గత విభేదాలు మరింత ముదురుతాయా? అన్నది కొద్ది గంటల్లోనే తేలనుంది.

Next Story