మద్యం సిండికేట్ దందా.. పేరుకే ఎమ్మార్పీ, 20 శాతం అదనపు వసూళ్లు!

by Jakkula.Mamatha |

మద్యం విక్రయాలలో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

మద్యం సిండికేట్ దందా.. పేరుకే ఎమ్మార్పీ,  20 శాతం అదనపు వసూళ్లు!
X

దిశ, కొణిజర్ల: మద్యం విక్రయాలలో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మండలానికి చెందిన మద్యం వ్యాపారులంతా సిండికేట్(ఉమ్మడి వ్యాపారం)గా ఏర్పడి అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ అందిన కాడికి అడ్డగోలుగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడటం చట్ట విరుద్ధం. అధిక లాభాల కోసం మద్యం వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారు. మద్యం అమ్మకానికి ఏ ఇంటి నెంబర్ పై లైసెన్స్ పొందారో అక్కడే క్రయ విక్రయాలు జరపాలి. కానీ మద్యం వ్యాపారస్తులు చట్ట విరుద్ధంగా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుపుతున్నారు.

అక్రమాలను అరికట్టాల్సినటువంటి ఎక్సైజ్ అధికారులు కళ్ళుండీ చూడలేని కబోది పక్షుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తమను అడిగే వారు లేకపోవటంతో తమకు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన రేట్లకు మద్యాన్ని అమ్ముతూ భారీగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ ధరకే మద్యం అమ్మాల్సి ఉన్నా ఎమ్మార్పీ ధరకు అమ్ముతున్న దాఖలాలు మచ్చుకైన కనిపించమంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదు. 18 ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నా వయస్సు నిమిత్తం లేకుండా మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణ సర్వత్రా ఇస్తున్నాయి.

సిండికేట్ దందా మద్యం వ్యాపారుల అవినీతి అక్రమాల తీరుతెన్నులను ఓసారి పరిశీలిస్తే!

మండల కేంద్రం కొణిజర్లలో మూడు తనికెళ్లలో ఒక మద్యం షాపుకు ప్రభుత్వం నుంచి మద్యం విక్రయాలకు అనుమతి ఉంది. నాలుగు షాపుల నిర్వహకులు కలిసి సిండికేట్ గా ఏర్పడి అడ్డగోలుగా తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు లైసెన్సుడ్ షాపుల ద్వారా గ్రామాల్లో బెల్ట్ షాపులకు ప్రతి రోజు మద్యం సరఫరా అవుతుంది. లైసెన్స్ పొందిన చోట తప్ప ఇతర ప్రదేశాలలో మద్యం విక్రయించడం నేరం. చట్ట పరిధిలో వ్యాపారం నిర్వహించుకోవలసిన వ్యాపారులు నిబంధనలను గాలికొదిలి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ విరివిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులో కొదవలేదు. గల్లీకి ఒకటి చొప్పున ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మద్యం అమ్మకాల్లో బెల్ట్ షాపులదే అగ్రస్థానం. 80 శాతానికి పైగా మద్యం విక్రయాలు బెల్ట్ షాపుల ద్వారానే జరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం బాటిల్ పై ఉన్న ఎంఆర్పీ ధరకే మద్యం విక్రయించాలి.

కానీ వైన్ షాపుల నిర్వాహకులు ప్రతి మద్యం సీసా పై బెల్ట్ షాపులకు రూ.30లు అదనపు ధరకు విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు మరో రూ.20లు అదనపు ధరకు మందు బాబులకు విక్రయిస్తూ సొమ్ము దండుకుంటున్నారు. దీంతో రోజువారీ కూలీ చేసుకునే ప్రజలతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ రూల్ 25 ప్రకారం జాతీయ రహదారులతో పాటు గుడి మసీదు చర్చి హాస్పిటల్ పాఠశాలలకు బస్టాండ్ వంటి రద్దీగా ఉండే ప్రదేశాలకు 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలి. కొణిజర్లలో మాత్రం ప్రైవేట్ పాఠశాల పక్కనే మద్యం షాపు నిర్వహిస్తున్నారు. దీని వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న అధికార యంత్రాంగం లేకపోవడం విశేషం. మద్యం అక్రమాలను నిరోధించాల్సిన ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టనట్టు వివరించడం పై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: వైరా ఎక్సైజ్ సీఐ

బెల్ట్ షాపుల నిర్వహణ ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయాలపై వైరా ఎక్సైజ్ సీఐ మమతను వివరణ కోరగా.. బెల్ట్ షాపులను మేము ప్రోత్సహించటం లేదు. చెప్పిన బెల్ట్ షాపుల నిర్వాహకులు వినడం లేదని చెప్పారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం విశేషం.

Next Story