- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం
మైనార్టీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ అర్బన్ జూన్ 30: మైనార్టీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని న్యాక్ సెంటర్‌లో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమ్మద్ అలీ షబ్బీర్ అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి ద్వారా మహిళలు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచి గౌరవప్రదమైన జీవనం సాగించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రూ.1.02 కోట్ల వ్యయంతో మొత్తం 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని, అందులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్న పరిశ్రమల స్థాయికి ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నుడా చైర్మన్ కేశ వేణు, రత్నాకర్, జావిద్ అక్రమ్, ఎం.ఏ. పహీం, నయీమ్, కరీం, పాప ఖాన్, హఫీజ్ లయీక్ ఖాన్, హరూన్ ఖాన్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






